Rain Alert: ఇవాళ్టి నుంచి మళ్లీ వర్షాలు.. 5రోజులు కుండపోతే.. బీఅలర్ట్‌

ముసురు ఇప్పుడిప్పుడే కాస్త శాంతించింది. వరదలు కంట్రోల్‌లోకి వచ్చాయ్. వాగులు, వంకలు శాంతంగా కనిపిస్తున్నాయ్. వరుణుడు చిన్న బ్రేక్ తీసుకోవడంతో.. జనాలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. చిన్న బ్రేక్ చిటికెలో వచ్చేస్తా అన్నట్లు.. వానదేవుడు మళ్లీ పలకరించబోతున్నాడు.

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 02:20 PM IST

ఈసారి అలాంటి ఇలాంటి పలకరింపు కాదు.. అంతకుమించి ! సోమవారం నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు ఊపందుకోనున్నాయ్. రాగల అయిదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. పశ్చిమ మధ్య, దాని పక్కనున్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. దక్షిణ ఒడిశా పరిసరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాగల ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ నెల 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం నుంచి రాగల నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. మూడు రోజుల భారీ వర్షాలకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పుడు కురవబోయే వానల ఆధారంగా మళ్లీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయ్.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ముసురు నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ఏరియాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలతో మళ్లీ టెన్షన్ పడుతున్న పరిస్థితి.