CM kcr: మెట్రో అంటే ఫ్లైఓవర్ కట్టినంత ఈజీనా ? కేసీఆర్ గారూ..మెగా మెట్రో ప్రాజెక్టు కేవలం ఎన్నికల కోసమేనా ?

ఎన్నికల ఏడాదిలో ఏ ప్రభుత్వం ఎలాంటి ప్రజాప్రయోజన నిర్ణయాన్ని ప్రకటించినా అందులో చిద్ధశుద్ధిని కచ్చితంగా అనుమానించాల్సి ఉంటుంది. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా మెగా ప్రాజెక్టులను ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 01:12 PM IST

అందులో ప్రధానమైంది దాదాపు 69 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ చుట్టూ మెట్రో ప్రాజెక్టును విస్తరించడం. మూడు నుంచి నాలుగేళ్ల కాలవ్యవధితో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిన్న కేటీఆర్ కేబినెట్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత సగటు తెలంగాణ ప్రజల్లో ఒకటే సందేహం.. ఇదంతా అయ్యే పనేనా అని. సామాన్యుల నుంచి మేథావుల వరకు అందరికీ ఇలాంటి అనుమానాలు రావడం వెనుక చాలా కారణాలున్నాయి.

ఆలోచన మంచిదే కానీ..

గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చాలన్న మీ ప్రభుత్వ ఆలోచన అభినందించదగినదే..! ఆమేరకు మీరు, మీ మంత్రివర్యులు చిత్తశుద్ధితో కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉంటే రానున్న ఐదారేళ్లలో హైదరాబాద్ చుట్టు పక్కల మెట్రో కారణంగా ప్రజారవాణావ్యవస్థ ఊహించని విధంగా మారిపోతుంది. కొత్త మెట్రో మార్గాల చుట్టూ రియల్ ఎస్టేట్ కూడా పెరిగిపోతుంది. హైదరాబాద్ ఖ్యాతి కూడా ఇనుమడిస్తుంది. అయితే ప్రాక్టికల్ గా ఇలాంటి ప్రాజెక్టులు ఎప్పటికి కార్యరూపం దాల్చుతాయన్నదే ప్రశ్న. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రారంభం నుంచి మెట్రో పట్టాలెక్కే వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఇప్పటికీ అనేక కారణాల వల్ల ఓల్డ్ సిటీ మెట్రో కాగితాలకే పరిమితమయ్యింది. పాతబస్తీ మెట్రో పరిధి కేవలం 5.5 కి.మీ మాత్రమే. 2014 ఇప్పటి వరకు ఈ మెట్రో లైన్ కోసం ఒక్క పిల్లర్ కూడా నిర్మించలేదు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటంతో.. ఇటీవలే పాతబస్తీ మెట్రో లో కదలిక వచ్చింది. కొత్తగా ప్రతిపాదించిన మెట్రో మార్గాల్లో ఓఆర్ఆర్ చుట్టుపక్కల మినహాయించి..మిగలిన చోట్ల భూసేకరణ కూడా ఆలస్యమయ్యే ప్రమాదముంది.

కేంద్రం సహకరిస్తుందా ? రాష్ట్రం దగ్గర డబ్బులున్నాయా ?

ఒకటి కాదు రెండు కాదు దాదాపు 69 వేల కోట్ల రూపాయలను హైదరాబాద్ చుట్టూ మెట్రో విస్తరణ కోసం ఖర్చు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వివిధ సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వానికి… కేవలం మెట్రో కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అంతా ఈజీ వ్యవహారం కాదనే చెప్పాలి. ప్రస్తుతమున్న హైదరాబాద్ మెట్రోను పబ్లిక్ , ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్ లో నిర్మించారు. మెట్రో నష్టాల నుంచి ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ సంస్థ బయటపడలేకపోతోంది. ఒకానొక దశలో మెట్రోను వదిలించుకునేందుకు కూడా ఆ సంస్థ ప్రయత్నాలు చేసింది. బీహెచ్ఈఎల్ నుంచి టోలిచౌక్ మీదుగా లకడీకాపూల్ వరకు మెట్రోను విస్తరించేందుకు రెండో దశ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రతిపాదనలు పంపినా కేంద్రంలో చలనం లేదు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో 278 కి.మీ మేర హైదరాబాద్ చుట్టూ మెట్రోను విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.

మెట్రో విస్తరణను ఎన్నికల స్టంట్‌గా చూడాలా ?

పాతబస్తీ వరకు మెట్రోను తీసుకెళ్లడంలో మీనమేషాలు లెక్కించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు రెండునెలల ముందు 69 వేల కోట్ల రూపాయలతో 8 రూట్లలో మెట్రోను విస్తరిస్తున్నామని చెప్పడం ఎన్నికల స్టంట్ గానే కనిపిస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమా ఆ పార్టీకి ఉండటంలో తప్పులేదు. కేసీఆర్ హ్యాట్రిక్ విజయంతో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినా… ఇంత భారీ ప్రాజెక్టును అసలు ముందుకు తీసుకెళ్తారా లేదా అన్నదే సందేహం. నిధులు, కేంద్ర సహకారం, భూసేకరణ ఈ మూడు అంశాల్లో స్పష్టతం లేకుండా ప్రభుత్వం మెట్రోను విస్తరిస్తున్నామని ప్రకటన చేస్తే.. అది కేవలం ఎన్నికల తాయిలంగానే జనం చూస్తారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. హైదరాబాద్ లో ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్లై ఓవర్లను వేగంగానే నిర్మించింది. ట్రాఫిక్ కష్టాలను తీర్చింది. అయితే ప్లైఓవర్లను కట్టినంత ఈజీగా మెట్రో పట్టాలెక్కుతుందా లేదా అన్నదే ప్రశ్న. ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే 69వేల కోట్ల ఈ మెగా ప్రాజెక్టు అసలు రూపం ఏంటో బయటపడుతుంది. అప్పటి వరకు ఇది కేవలం ఎన్నికల వార్త మాత్రమే.