Metro Rail: హైదరాబాద్‌ మెట్రో ఆల్‌టైమ్ రికార్డ్‌..

హైదరాబాద్ మెట్రో మరో అరుదైన రికార్డును సృష్టించింది. మెట్రో రైల్‌ పట్టాలు ఎక్కిన తర్వాత.. క్రమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో మెరుగు పడుతూ వస్తోంది.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 07:40 PM IST

గణేష్‌ నిమజ్జనంతో పాటు మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో రికార్డు స్థాయిలో ప్రయాణికులను తీసుకెళ్లింది. ఐతే ఇప్పుడు చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది హైదరాబాద్ మెట్రో. సోమవారం రోజు అంటే జులై ౩న ఏకంగా 5లక్షల 10వేల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది. హైదరాబాద్‌ మెట్రో రైలు చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. ‘ఈ రికార్డు పర్యావరణ అనుకూలమైన, వేగవంతమైన, హైదరాబాద్‌లో సౌకర్యవంతమైన, అత్యంత సుఖవంతమైన ప్రయాణ విధానం పట్ల ప్రయాణీకుల విశ్వాసంతో పాటూ ఆమోదాన్ని సూచిస్తోందని’ హెచ్‌ఎంఆర్‌ తెలిపింది. చారిత్రాత్మకమైన మైలురాయిని అందుకోవడంతో.. ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ధన్యవాదాలు తెలిపింది.

‘ఇది ఒక ముఖ్యమైన సందర్భం.. హెచ్‌ఎంఆర్‌ని తాము ఇష్టపడే ప్రయాణ భాగస్వామిగా ఎంచుకుంటూ తమ సంఘీభావాన్ని చూపిన విలువైన ప్రయాణికులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని’ అధికారులు ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపినా.. స్థిరమైన ప్రయత్నాలు, కృషి ద్వారా.. ఈ విజయాన్ని అందుకున్నామని వివరించారు. హైదరాబాద్‌లో మెట్రో ఎంట్రీ తర్వాత ట్రాఫిక్‌ తగ్గుతుందని భావించినా.. రికార్డు స్థాయిలో మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నా.. ఇప్పటికీ ట్రాఫిక్‌ కష్టాలు వెంటాడుతోన్న వెంటాడుతూనే ఉన్నాయ్. దీనికితోడు మెట్రో రైళ్ల రాకపోకలను కూడా పెంచాలని మరికొందరు ప్రయాణికులు కోరుతున్నారు. వీక్‌ డేస్‌లో.. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉంటున్నారు. దీనికి అనుగుణంగా సర్వీసులు పెంచాలన్న డిమాండ్‌ జనాల నుంచి వినిపిస్తోంది.