డ్రైనేజీల్లో కొట్టుకుపోతున్న ప్రాణాలను చూస్తే తెలుస్తుంది.. హైదరాబాద్‌కు మరోవైపు ఏంటో ! ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏటా నాలాల్లో పడి చాలామంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ రోడ్లను ఇస్తాంబుల్‌గా మారుస్తామన్న పాలకులు.. నాలాలను బాగుచేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సికింద్రాబాద్ కలాసిగూడలో ఎనిమిదేళ్ల చిన్నారి పాల ప్యాకెట్ తీసుకురావడానికి బయటకు వెళ్లి నాలాలో పడి ప్రాణం విడిచింది.
అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎందుకు అక్కడికి వెళ్లలేదు.. ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసి ఎందుకు చేతులు దులుపుకున్నారనే ప్రశ్నలు ఎంతోమంది దగ్గరనుంచి వినిపిస్తున్నా.. ఆ చిన్నారి తల్లిదండ్రుల ఏడుపు ముందు ఇవి ఎవరికీ పెద్దగా వినిపించడం లేదు. ఏటా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా.. ఇప్పటికీ శాశ్వత పరిష్కారం చూపించలేకపోతోంది సర్కార్.
చిన్న వాన కురిస్తే చాలు.. హైదరాబాద్ నగరం మునిగిపోతోంది. గతేడాది కార్లు.. కార్లతో పాటు ప్రాణాలు కొట్టుకుపోయాయ్. గత విషాదాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు ఏ మాత్రం కనిపించడం లేదు ప్రభుత్వం. ఎండాకాలంలో కురిసిన వానకే ఇలా ప్రాణాలు పోతుంటే.. వర్షాకాలం వస్తే పరిస్థితి ఏంటనే భయాలు ఇప్పుడు జనాలను వెంటాడుతున్నాయ్. అయ్యా జనాల్లారా.. ప్రభుత్వాలు పట్టించుకోవు.. అధికారులు కనీసం అక్కరకు కూడా రావు. మీ జాగ్రత్తల్లో మీరుండండి.. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండని చెప్పాలనిపిస్తోంది గట్టిగా ఎందుకో!