హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైంది…. ఇప్పట్లో లేవదా…? ఎన్నికల ఫలితాలను బట్టి రియల్ ఎస్టేట్ గమనం.. ఈ ఏడాది చివరి వరకు ఇదే పరిస్థితి. అపార్ట్‌మెంట్ సేల్స్ లేవు… ల్యాండ్ సేల్స్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సహజంగా ఎన్నికల ఏడాదిలో రియల్ ఎస్టేట్ స్తంభిస్తుంది. హైదరాబాద్‌కు మాత్రం రెండేళ్ల నుంచే ఇదే పరిస్థితి ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అయిపోయినా…. మరో ఆరు నెలల దాకా ఇదే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపులు చూస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు వేచి చూసే ధోరణిలో పడ్డారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపులు చూస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. గ్రేటర్ పరిధిలో జరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదిక రిలీజ్ చేసింది. గత ఏడాది మార్చిలో 6 వేల 959 రిజిస్ట్రేషన్లు జరిగితే, ఈ ఏడాది మార్చిలో 6 వేల 416 నమోదయ్యాయి. అంటే 8 శాతం పడిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరితో చూసినా 10 శాతం పడిపోయాయి. నిరుడు డిసెంబర్‌తో పోలిస్తే ఈ జనవరిలోనూ రిజిస్ట్రేషన్లు 25 శాతం తగ్గాయి.
సొంతింటి కలకు మధ్యతరగతి వర్గాలు దూరమైనట్టు లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో నిరుడు మార్చితో చూస్తే.. ఈ ఏడాది మార్చిలో 25 లక్షలలోపు ఆస్తుల రిజిస్ట్రేషన్లు 18 శాతం నుంచి 14 శాతానికి దిగజారాయి. అలాగే 25 నుంచి 50 లక్షలలోపు రిజిస్ట్రేషన్ల వాటా కూడా 53 నుంచి 45 శాతానికి పతనమైందని నైట్ ఫ్రాంక్ రిపోర్టు చెబుతోంది. 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల్లోని నివాసాలకు డిమాండ్ గతంలో 17 శాతం ఉంటే, ఇప్పుడు 13 శాతంగానే ఉన్నది. దీన్ని బట్టి మిడిల్ క్లాస్ కస్టమర్లు మార్కెట్‌కు దూరమయ్యారని అర్థమవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ముందు డౌన్ అయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సార్వత్రిక ఎన్నికలు ముగిసినా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఎన్నికల కోసం క్యాష్ మళ్లింపుతో పాటు… భారీగా పెరిగిన భూముల ధరలతో రియల్ ఎస్టేట్ పై ప్రభావం పడింది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన రియల్టర్లు… వడ్డీలకు వడ్డీలు కడుతూ లబో దిబోమంటున్నారు. ప్రీలాంచ్ ఆఫర్స్ పనిచేయం లేదు. మరో ఆరు నెలలపాటు ఇదే సీన్ ఉంటుందని అంటున్నారు. ఎన్నికల ముందు కోకాపేట ఎకరం భూమిని వంద కోట్లు చూపించారు రియల్ వ్యాపారులు. ఇప్పుడా ప్రాంతంలో గజం నిర్మాణానికి కూడా అనుమతులు లేవు. ఉప్పల్, కోకాపేట, బుద్వేల్ మోకిలాలో ఆక్షన్ వేసినప్పుడు భూమి వేల కోట్లు పలికింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఢమాల్ అవడంతో బిత్తర చూపులు చూస్తున్నారు వ్యాపారులు. ఇంత జరిగినా తీరు మార్చుకోకుండా స్క్వేర్ ఫీట్ ధరలను వరుసగా పెంచుకుంటూ పోతున్నారు బిల్డర్లు. మార్కెట్ రేట్ తగ్గితే …తమ ప్రాజెక్టుల విలువ పడిపోతుందని కలరింగ్ ఇచ్చుకుంటున్నారు.
గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ రియాల్టీ రంగం దేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. దేశంలోని 7టాప్ సిటీలతో పోల్చితే హైదరాబాద్ రియాల్టీలో కొత్త వెంచర్ల హడావిడి బాగా పెరిగింది. అయితే ఇష్టమొచ్చినట్టుగా ఇచ్చిన ప్రాజెక్ట్‌ల అనుమతితో అమ్మకం కాని యూనిట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కిందటేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య ఆరు నెలల్లో 16వేల 353 ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. కొత్త ఏడాదిలోనూ భారీగానే కొత్త వెంచర్లు లాంఛింగ్స్ పెరిగాయి. దీంతో అమ్మకం కాని ఫ్లాట్ల సంఖ్య కూడా పెరిగిందని రియాల్టీ సంస్ధలు అంగీకరిస్తున్నాయి. బ్యాంక్ లోన్స్ వడ్డీ రేట్లు విపరీతంగా పెరగడం, భూమి ధర పెరగడంతో నిర్మాణ వ్యయాలు పెరిగాయంటున్నారు. దాంతో ప్రస్తుత పరిస్ధితుల్లో ఇల్లు, ప్లాట్స్ కొనడానికి కొనుగోలుదారులు వెనుకాడుతున్నట్టు రియల్టర్లు చెబుతున్నారు.
ఒకప్పుడు నెలకు దాదాపుగా హైదరాబాద్ రియాల్టీ రంగంలో 4వేల నుంచి 5వేల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగేవి. కానీ ఇపుడా పరిస్థితి లేదు. 2023లో ప్రాపర్టీ ఈక్విటీ ఇచ్చిన నివేదిక చూస్తే దాదాపుగా లక్ష అన్‌సోల్డ్ ఇన్వెంటరీ హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇపుడు కొత్త ఏడాదిలో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. 16 నెలలుగా ఈ అన్‌సోల్డ్ ఇన్వెంటరీ పేరుకుపోయినట్టు సమాచారం. హైదరాబాద్‌లో భూముల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా ఎకరం ల్యాండ్ ధర 100 కోట్లు పలకడంతో దీన్ని కొందరు రియల్టర్లు క్యాష్ చేసుకోడానికి ఆ భూముల్ని చూపిస్తూ కృత్రిమంగా భూములు, ప్లాట్ల ధరలు పెంచేస్తున్నారనే వాదన ఉంది. దాంతో చాలా మంది రియల్టర్లపై ఆ ప్రభావం పడుతుందని కొందరు వాదిస్తున్నారు. బుద్వేల్, కిస్మత్ పురా, బండ్లగూడ, నార్సింగి లాంటి ప్రాంతాల్లో ఒకప్పుడు గజం భూమి ధర 50 వేలు ఉంటే ఇపుడు లక్ష నుంచి లక్షా 20వేల దాకా పలుకుతోంది. దీంతో అక్కడ కట్టే ప్లాట్ల ధరలు 20 నుంచి 30శాతం దాకా బిల్డర్లు పెంచి అమ్ముతుండటం కూడా అమ్మకాలు పడిపోయి అన్‌సోల్డ్ ఇన్వెంటరీ పెరగడానికి కారణమౌతోంది.
మెట్రోనగరాలైన బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీల్లోనూ ఇలా కృత్రిమంగా ధరలు పెరగడంతో అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నది. పైగా అక్కడ అఫర్డబుల్ హౌజింగ్ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మొత్తం అమ్మకాలు జరిగే డబుల్ బెడ్ రూమ్స్ సేల్స్ కూడా కుప్పకూలాయి. ఇపుడిదే పరిస్ధితి హైదరాబాద్ మార్కెట్లో కనిపిస్తోందని ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్ధలు హెచ్చరిస్తున్నాయి. ఇష్టానుసారంగా పెరుగుతున్న రియాల్టీ ధరలపై, కృత్రిమ డిమాండ్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.