Hyderabad Voters : హైదరాబాద్ ఓటర్లూ… మేల్కొనండి ! ఓటేద్దాం రండి !!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్ల కంటే హైదరాబాద్ వాసులు వెనుకబడి ఉన్నారు. మొదటి 3 గంటల్లో 5 శాతం లోపే ఇక్కడ పోలింగ్ నమోదైంది. సిటీ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు, సోషల్ వర్కర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 12:38 PM IST

Telangana Elections 2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలవడంతో గ్రామాలు, పట్టణాల్లో ఓటర్లు భారీగా క్యూలు కట్టారు.  కానీ హైదరాబాద్ సిటీలో మాత్రం జనం ఇంకా బద్దకిస్తున్నారు.  తొలి మూడు గంటల్లో రాష్ట్రమంతటా 20శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.  కానీ హైదరాబాద్ సిటీలో 4.57 శాతమే ఓట్లేశారు. అయితే సినీ, రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ లో 10శాతం దాకా పోలింగ్ నమోదైంది.  పాతబస్తీలో అయితే ఉదయం 10 గంటల దాకా చాలా ఏరియాల్లో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపించాయి.  ప్రతి ఎన్నికల లాగానే భాగ్యనగరవాసులు ఈసారి కూడా ఓట్లు వేయకుండా సెలవు దొరికింది అని ఎంజాయ్ చేస్తున్నారా ? లేదంటే మధ్యాహ్నం తర్వాత పోలింగ్ బూత్స్ కి వచ్చి ఓట్లేస్తారా అన్నది చూడాలి.  అభిమానులు ఆరాధించే సినీ నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు వారి కుటుంబసభ్యులంతా ఉదయాన్నే సామాన్యుల లాగా క్యూలో నిలబడి మరీ ఓట్లు వేశారు.  ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.  ఓటు వేసినప్పుడే ప్రశ్నించే హక్కు లభిస్తుందన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.  సోషల్ మీడియాలో సమస్యల మీద ఫోటోలో పెట్టి స్పందించే యూత్ … పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సెలబ్రిటీలు, ప్రజాస్వామికవాదులు కోరుతున్నారు.  ఆర్టీసీ ఎండి సజ్జనార్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ లాంటి ప్రముఖులు ఓట్లు వేయాలని X (ట్విట్టర్) ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.