చినుకు పడితే హైదరాబాద్ వణికిపోవాల్సిన పరిస్థితి. వరదలతో నిండిపోతోంది నగరం. చెరువులు, నాలాల కబ్జాలు, అక్రమ నిర్మాణాలే కారణం. ఇలాంటి వాటిపై రేవంత్ సర్కార్ కొరఢా ఝులిపిస్తోంది. అక్రమనిర్మాణాల అంతుచూస్తోంది. హైడ్రా ఏర్పాటు చేయగా.. అది తగ్గేదే లే అంటోంది. వాళ్లు వీళ్లు కాదు.. అక్రమ నిర్మాణం అని తేలితే చాలు జేసీబీలను పంపిచేస్తోంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేసింది. రేవంత్ తమ్ముడికి కూడా నోటీసులు ఇచ్చింది. ఐతే ఇలాంటి తరుణంలో.. ఇప్పుడు ఆనంద్ హోమ్స్ మాయ తెరమీదకు వస్తోంది.
గండిపేట్ మండల పరధిలోని మణికొండ జాగీర్, నార్సింగి మున్సిపాలిటీ సరిహద్దుల్లో ఉన్న చిన్న పెద్ద చెరువుల బఫర్‌జోన్‌లో ఆనంద్ హోమ్స్ నిర్మాణాలపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయ్. అధికారుల అండతో.. ఆనంద్ హోమ్స్ నిర్వాహకులు రెండు చెరువుల మధ్య FTL, బఫర్‌జోన్‌లో హైరైజ్ భవనాలు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆనంద్ హోమ్స్‌పై హైడ్రా దృష్టిసారించాలని సూచిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలో చెరువులు, కుంటలు భారీగా ఆక్రమణలకు గురవుతున్నాయ్. FTL, బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపడుతుండడంతో.. నీరు నిల్వ ఉండే ప్లేస్ లేకుండా పోతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటుకుపోతున్నాయ్. రెండు, మూడు వేల అడుగులకు దిగువన బోర్లు వేస్తే తప్ప.. నీళ్లు రావడం లేదు అంటే.. ఏ స్థాయిలో నీటి కరువు ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం చేసుకోవచ్చు. గండిపేట్ రెవెన్యూ విభాగం, మణికొండ మున్సిపాలిటీ, నార్సింగి మున్సిపాలిటీ అధికారులు, టౌన్‌ప్లానింగ్ విభాగం, ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారులు.. అడ్డదారిలో పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తుండడంతో.. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాల్సిన చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయ్.
FTL, బఫర్‌జోన్ పరిధిలో ఆనంద్ హోమ్స్ అక్రమ నిర్మాణాలు చేపడుతూ.. భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతుందనే చర్చ జరుగుతోంది. చెరువులు, కుంటలు, తటాకాల FTL, బఫర్‌జోన్‌లలో నిర్మాణాలు చేపట్టడంపై.. హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. దీంతో మణికొండ జాగీర్, నార్సింగి మున్సిపాలిటీ సరిహద్దుల్లోని చిన్న, పెద్ద చెరువుల బఫర్‌జోన్‌లో ఆనంద్ హోమ్స్ హైరైజ్ బిల్డింగ్‌లు నిర్మిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. హైడ్రా రంగంలోకి దిగి సర్వే నిర్వహించి.. FTL, బఫర్‌జోన్ సరిహద్దులు గుర్తిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా మీదే చాలా ఆశలు పెట్టుకున్నారు. స్థానికులు రోజూ హైడ్రాకు వినతులు పంపిస్తూనే ఉన్నారని తెలుస్తోంది. మరి హైడ్రా నజర్ పెడుతుందా.. ఆనంద్ హోమ్స్ మాయకు చెక్ పెడుతుందా లేదో చూడాలి.