IAS Smita Sabharwal : నీకో దండం తల్లి… ఐఏఎస్‌ల సంఘం..

ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయ నేతల నుంచి.. దివ్యాంగుల సంఘాల వరకు.. స్మితా వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. దివ్యాంగులను ఉద్దేశించి స్మితా చేసిన పోస్ట్.. ఈ రచ్చకు కారణం అయింది.

ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయ నేతల నుంచి.. దివ్యాంగుల సంఘాల వరకు.. స్మితా వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. దివ్యాంగులను ఉద్దేశించి స్మితా చేసిన పోస్ట్.. ఈ రచ్చకు కారణం అయింది. ఐఏఎస్‌లో దివ్యాంగులకు ప్రత్యేక కోట అవసరమా అంటూ స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయ్. తన వ్యాఖ్యలను స్మితా వెనక్కి తీసుకోవాలని.. తక్షణం దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయ్. స్మిత వ్యాఖ్యలపై ఆమెపై కేసు కూడా నమోదయింది. ఐనా సరే.. ఈ వ్యవహారంలో స్మిత వెనక్కు తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని ఒక్క మాట చెప్పడం లేదు.

పైగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసిన వారిపై కౌంటర్లు వేస్తున్నారు స్మితా. డిప్యూటీ సీఎం భట్టితో పాటు.. మంత్రి సీతక్క, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌లాంటి వాళ్లు విమర్శలు చేసినా.. స్మితా మాత్రం వెనక్కి తగ్గడం లేదు సరి కదా.. తన ప్రశ్నలో తప్పే లేదు అన్నట్లు కామెంట్లు చేస్తోంది. ఐతే స్మితా వ్యాఖ్యలపై ఐఏఎస్‌లు కూడా ఆగ్రహంతోనే ఉన్నారని తెలుస్తోంది. దివ్యాంగులపై స్మితా చేసిన కామెంట్స్‌ను.. మెజారిటీ ఐఏఎస్‌లు తప్పుపడుతున్నట్లు సమాచారం. సోషల్‌ మీడియా వేదికగా.. ఆమెపై జరుగుతున్న విమర్శల దాడి సరైనదేనని.. ఈ విషయంలో ఆమెకు సపోర్టుగా నిలవాల్సిన అవసరం లేదని.. సీనియర్ అధికారులు కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఐఏఎస్ అధికారులకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని.. స్పెషల్‌ సీఎస్ హోదాలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి బహిరంగంగానే అన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక తమ అంతర్గత సమావేశాల్లోనూ.. స్మితా తీరును ఐఏఎస్‌ అధికారులు తప్పు పడుతున్నారుని తెలుస్తోంది. బాధ్యత గల అధికారులు వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయరని.. ఓ మహిళా ఐఏఎస్ అధికారి ఇప్పటికే కామెంట్‌ చేసినట్లు సమాచారం. ఓ మాట జారి తప్పు చేశావ్‌.. నీకు అండగా నిలిచి ఇంకో తప్పు చేయలేం అంటూ.. వాళ్లలో వాళ్లు ఐఏఎస్‌లు డిస్కస్ చేసుకుంటున్నారట. ఏమైనా ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టితో పాటు.. మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. మరి ప్రభుత్వపరంగా స్మితా మీద చర్యలు ఉంటాయా లేదా చూడాలి మరి.