ENG vs AFG: మరోసారి కొంపముంచిన బజ్‌బాల్‌.. అఫ్ఘాన్‌పై ఓటమితో పరువు పోగొట్టుకున్న ఇంగ్లండ్‌!

అఫ్ఘాన్‌ స్పిన్నర్ల టాలెంట్‌కు ఇంగ్లండ్‌ తోక ముడిచింది. ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. ఇంగ్లండ్‌పై అఫ్ఘాన్‌ గెలవడంతో ఆ దేశ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

  • Written By:
  • Publish Date - October 16, 2023 / 07:31 AM IST

బజ్‌బాల్‌ అంటూ క్రికెట్‌లో కొత్త స్ట్రాటజీని తీసుకొచ్చిన ఇంగ్లండ్‌ ఇప్పటికీ అనేకసార్లు ఈ విధానంతో బొక్కబోర్లా పడింది. అయినా కూడా ఆటతీరులో మార్పులేదు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాతో వరల్డ్‌కప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్‌ పసికూన అఫ్ఘాన్‌ చేతిలో ఓడిపోవడం యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. అయితే ఈ గెలుపు క్రికెట్‌ ప్రేమికులను ఆనందపెట్టింది. చిన్న జట్లకు వరల్డ్‌కప్‌లో ఛాన్స్ ఇవ్వాలని.. గతంలో లాగా కనీసం 12 జట్లను వరల్డ్‌కప్‌లో ఆడించాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉండగా.. బీసీసీఐ చెప్పుచేతల్లో నడిచే ఐసీసీ పూర్తిగా కమర్షియల్‌గా ఆలోచించి జట్ల సంఖ్యను 10కి తగ్గించింది. ఇప్పుడు క్రికెట్‌ని కనిపెట్టిన ఇంగ్లండ్‌ని నిన్నగాక మొన్న వచ్చిన అఫ్ఘాన్‌ మట్టికరిపించడం ఐసీసీకి చెంపదెబ్బ లాంటిది.

ఇటు బజ్‌బాస్‌ ఆటతో గెలవలేని మ్యాచ్‌లను ఎన్నో గెలుచుకున్న ఇంగ్లండ్‌ గెలిచే మ్యాచ్‌లను మాత్రం ఓడిపోతూ వస్తోంది. దూకుడిగా ఆడడమే బజ్‌బాల్‌ స్ట్రాటజీ. భయం లేకుండా.. బౌలర్ ఎవరు అన్నది లెక్కచేయకుండా ఆడాల్సి ఉంటుంది. వేగవంతమైన స్కోరింగ్ రేట్‌ ఉండాలి. బజ్‌బాల్‌ క్రికెట్ ప్రభావంతో ఇంగ్లండ్ దూకుడుగా ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లు, బౌలింగ్ మార్పులను చేపట్టింది. ఇక్కడి వరుకు బాగానే ఉన్నా ఈ విధానం పదేపదే బెడిసికొడుతోంది. అయితే టెస్టుల్లో బజ్‌బాల్‌ కొన్ని మ్యాచ్‌ల్లో సక్సెస్‌ అయింది. ఇటు వన్డేల్లో మాత్రం ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ కాకుండా బాయ్‌కాట్‌ బాల్‌ ఆడుతుందంటూ ఆ దేశ అభిమానులే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంగ్లండ్‌పై గెలుపుతో అఫ్ఘాన్‌ వరల్డ్‌కప్‌ పాయింట్ల పట్టికలో ఆరో ప్లేస్‌కి వచ్చింది. మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌ గెలిచింది అఫ్ఘాన్‌. అటు ఇంగ్లండ్‌ ఐదో స్థానంలో ఉంది. బట్లర్‌ టీమ్‌కు మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచే గెలిచింది. అఫ్ఘాన్‌, ఇంగ్లండ్ దాదాపు ఒక్కటే స్థితిలో ఉన్నాయి. 2019 ప్రపంచ కప్‌ గెలిచినా ఇంగ్లండ్‌ ఈ వరల్డ్‌కప్‌లోనూ టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది. అయితే తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ బ్యాటర్ల దెబ్బకు బొక్కబోర్లా పడింది. ముఖ్యంగా చెత్త ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్, పేలవమైన బౌలింగ్‌ ఆ జట్టు కొంపముంచింది. ఇటు అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయారు ఇంగ్లండ్‌ బ్యాటర్లు. బ్రూక్‌ మినహా ఏ ఒక్కరూ ఆడలేకపోయారు. ఇలా వచ్చామా అలా పోయామా అన్నట్టు ఆడారు.