‍Nipah Virus: కేరళలో నిఫా వైరస్ పై స్పందించిన ఐసీఎంఆర్.. వ్యాధి సోకిన ఆరుగురిలో ఇద్దరు మృతి

నిఫా వైరస్ చాపకింద నీరులాగా క్రమక్రమంగా విస్తరిస్తోంది. గతవారం ఇద్దరు మృతి చెందగా శుక్రవారం తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమై యుద్దప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది.

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 12:51 PM IST

నిఫా.. పేరు రెండు అక్షరాలే అయినా ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. నెలల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు చికిత్స పొందుతున్నారు. దీని పై కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు. కేసుల క్రమక్రమంగా పెరుగుతున్న దృష్ట్యా.. ఇన్ఫెక్షన్స్ బారినపడే అవకాశం ఉన్న వారందరికీ పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా 11 మంది అనుమానితుల శాంపిల్స్ ని తీసుకొని పరీక్షించగా ఎవరికీ ఈ వ్యాధి సోకలేదని నిర్థారించారు. దీనిని బాంగ్లాదేశ్ వేరియంట్ గా గుర్తించారు. దీని ప్రభావంతో మరణాలు అధికంగా ఉంటాయని భావించింది కేరళ ప్రభుత్వం.

ఐసీఎంఆర్ ఏమంటోంది..

నిఫా వైరస్ పై కేంద్ర కణజాల రిసెర్చ్ సెంటర్ తాజాగా స్పందించింది. దీని ప్రభావం కోవిడ్ కంటే కూడా తీవ్రంగా ఉంటుందని ధృవీకరించింది. కరోనా తో మృతుల రేటు 2-3 శాతం ఉండగా.. నిఫా మరణాల రేటు 40-70శాతం ఉంటుందని తెలిపింది. అంటే కరోనా కంటే అత్యంత తీవ్రంగా ఇది విస్తరించించి మరణాలపై అధికంగా ప్రభావం చూపుతుంది. దీనిని నియంత్రించేందుకు మాస్క్ ధరించడంతో పాటూ సామాజిక దూరం పాటించి సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ భట్ తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారు వెంటనే వైద్యులకు సంప్రదించాలని ఇతరులతో కలవడం, మాట్లాడటం చేయవద్దని సూచించారు. దీని చికిత్సకు అవసరమయ్యే మోనోక్లోనల్ యాంటీబాడీని కేరళకు పంపించారు. అయితే ప్రస్తుతం వీటి డోసులు 20 మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి మరిన్ని డోసులు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఔషధం రోగికి ప్రారంభ దశలోనే అందిస్తేనే పనిచేస్తుందన్నారు. నిఫా వైరస్ పై చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది డబ్లూహెచ్ఓ. అటవీ ప్రాంతాల్లో నివసించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

కేరళ ప్రభావం పక్కరాష్ట్రాలపై..

కేరళలో నిఫా వైరస్ వెలుగులోకి రావడంతో పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక అప్రమత్తమైయ్యాయి. సరిహద్దుల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అటుగా వచ్చే వాహనాలలోని వారికి పరీక్షలు జరిపడమే కాకుండా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు.  ఇప్పటికే ఈ వైరస్ కేరళలో ప్రభావం చూపడం ఇది నాలుగో సారిగా గుర్తించారు. ముందుగా 2018లో కొజికోడ్ జిల్లాలో వ్యాపించగా.. దీని ప్రభావంతో 21 మంది మృత్యువాత పడ్డారు. 2019లో ఎర్నాకుళంలో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. 2021లో మరోసారి కొజికోడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ తాజాగా మరోసారి తీవ్ర ప్రభావం చూపుతోంది.

T.V.SRIKAR