‍Nitin: హీరో నితిన్ మామకు కాంగ్రెస్‌ షాక్‌

తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఓ వైపు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. మరోవైపు టికెట్లపై ఆశలు పెట్టుకొని భంగపడ్డ నేతలు పక్క చూపులు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 01:40 PM IST

తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఓ వైపు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. మరోవైపు టికెట్లపై ఆశలు పెట్టుకొని భంగపడ్డ నేతలు పక్క చూపులు చేస్తున్నారు. అంసతృప్తితో ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల చేయగా.. కొందరు ఆశావాహులకు అధిష్టానం మెండిచేయి చూపించింది. దీంతో వారు భవిష్యత్ కార్యచరణపై సమాలోచనలు చేస్తున్నారు. టాలీవుడ్‌ హీరో నితిన్‌ మేనమామ కాట్పల్లి నగేష్‌ రెడ్డికి కాంగ్రెస్ షాకిచ్చింది.

ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్న నగేష్‌ రెడ్డి.. నిజామాబాద్‌ రూరల్‌ టికెట్ దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఆ స్థానం నుంచి ఆయన పేరు లేదు. మరోసారి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీంతో నగేష్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. దాదాపు 3దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నా.. సరైన గుర్తింపు దక్కటం లేదని నగేష్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలిసింది. నగేష్ రెడ్డి పదేళ్లకు పైగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు.

ఈ మధ్యే రేవంత్ రెడ్డిని కూడా కలిసి టికెట్ హామీ పొందినట్లు సమాచారం. నగేష్ రెడ్డికి టికెట్ ఇస్తే.. అల్లుడు నితిన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారనే ప్రచారం కూడా సాగింది. అదే జరిగితే చాలా సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందనే విశ్లేషణలు వినిపించాయ్. నగేష్ రెడ్డికి టికెట్ ఇవ్వటం ద్వారా నితిన్ ఎన్నికల ప్రచారానికి వస్తారని.. దాంతో పార్టీకి మైలేజీ వస్తుందని స్థానిక నేతలు భావించారు. కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా నితిన్ వ్యవహరిస్తారని.. తద్వారా చాలా సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థులకు ప్లస్ అవుతుందని అనుకున్నారు. అనుహ్యంగా నగేష్ రెడ్డిని కాదని భూపతి రెడ్డికే మరోసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మామకు టికెట్ దక్కకపోవటంతో నితిన్ కూడా ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.