తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పరిణామం జరగబోతోంది. BRS ప్రభుత్వంలో SIB ఛీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు (Prabhakar Rao)… అమెరికా నుంచి తిరిగొస్తున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే… మొత్తం ట్యాపింగ్ వ్యవహారం కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మారితే మాత్రం… BRS లో కీలక నేతల దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల మెడకు కేసు చుట్టుకునే ఛాన్సుంది. ట్యాపింగ్ కి ఆదేశించిన వాళ్ళంతా కట కటాల పాలవ్వక తప్పదని తెలుస్తోంది.
KCR ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో SIB చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు… ఈఇద్దరే కీలకం. వీళ్ళ ఆదేశాలతోనే మిగతా పోలీస్ అధికారులు పనిచేశారు. BRS కీలకనేతలు, మంత్రులు, MLAలు… ఇలా ఎవరు ఆదేశిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారో బండారం అంతా బయపడనుంది. ప్రభాకర్ రావును పోలీసులు విచారించినా లేదంటే ఆయనే అప్రూవర్ గా మారి నిజాలు బయటపెట్టినా… ఆరోపణలున్న గులాబీ నేతలు జైళ్ళకి వెళ్ళడం ఖాయం.
ప్రభాకర్ రావు తాను కేన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళాననీ… జూన్ లేదా జులైలో హైదరాబాద్ కు వస్తానని ఈమధ్యే ఓ పోలీస్ అధికారికి కాల్ చేసి చెప్పారు. కానీ ఉన్నట్టుండి సడన్ గా ఆయన తిరిగి వస్తుండటం సంచలనంగా మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలకం. ఆయన అరెస్ట్ కోసం పోలీసులు ఇంటర్ పోల్ సాయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. పైగా ప్రభాకర్ రావు అరెస్ట్ అయ్యే దాకా… మిగతా నిందితులకు బెయిల్ కూడా దొరకదు. అందుకే కొందరు మాజీ అధికారులు మధ్యవర్తిత్వం చేసి… ఆయన్ని అమెరికా నుంచి రప్పిస్తున్నట్టు తెలుస్తోంది.
రాధాకిషన్ రావు విచారణలో మరి కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. ఫోన్ల ట్యాపింగ్ కోసం హైదరాబాద్ సహా మరో 5చోట్ల సర్వర్ల ఏర్పాటు చేసినట్టు తేలింది. నల్గొండ, మహబూబ్ నగర్ తోపాటు సిటీ శివారు ప్రాంతాల్లో ఈ సర్వర్లు పెట్టారు. వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేయడానికే వీటిని ఏర్పాటు చేశారు. వాళ్ళ ఫోన్లు విని… బ్లాక్ మెయిల్ చేయడం… ఆ తర్వాత ప్రైవేట్ సైన్యాన్ని పంపి ప్రభాకర్ రావు సెటిల్మెంట్స్ చేసినట్టు సిట్ గుర్తించింది. రాధా కిషన్ కూడా తన సిబ్బందితో రాష్ట్రమంతటా సెటిల్మెంట్లు చేశారని సమాచారం. అధికారులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభాకర్ రావు, రాధా కిషన్ ఈ వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది. వ్యాపారులతో పాటు రాజకీయ నాయకుల్ని కూడా బెదిరించి వసూళ్ళకు పాల్పడినట్టు గుర్తించారు. రాధాకిషన్ రావు వసూళ్ల దందాపై పోలీసులు మరింత కూపీ లాగుతున్నారు. కొందరు వ్యాపారవేత్తలు, మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్లను రికార్డు చేయబోతున్నారు. SIBలో పనిచేసిన నలుగురు పోలీసు అధికారుల స్టేట్మెంట్లను కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే అసలు ప్రభాకర్ రావు కి ఆదేశాలిచ్చిన ఆ కీలక నేతలు ఎవరన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు. ప్రభాకర్ రావు అరెస్ట్ తర్వాత ట్యాపింగ్ వ్యవహారం మొత్తం బయటపడే ఛాన్సుంది.