KCR CAR : కారు షెడ్డుకెళ్ళిపోయింది భయ్యా

తెలంగాణలో లోకసభ ఫలితాలు బీఆర్‌ఎస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ రిజల్ట్స్‌ మీద పార్టీ వర్గాల్లో ముందు నుంచి పెద్దగా ఆశ లేకున్నా... చివరికి అంతకు మించి టాప్‌ టు బాటమ్‌ షేకయ్యేలా ఫలితాలు వచ్చాయన్నది ఇంటర్నల్ టాక్‌. ఇంత దారుణమైన పరాభవాన్ని లీడర్స్‌గాని, కేడర్‌గాని ఎవ్వరూ ఊహించలేదట.

 

 

అసెంబ్లీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు షాకిస్తే… లోక్‌సభ ఎన్నికలు డబుల్‌ షాకిచ్చాయి. కచ్చితంగా గెలుస్తామని పార్టీ పెద్దలు చెప్పుకున్న మెదక్‌లో కూడా మూడో స్థానానికి పడిపోయింది. మొన్నటి దాకా అధికారంలో ఉన్న పార్టీ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటును కూడా గెల్చుకోలేకపోవడం దారుణం. చివరికి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఆధిపత్యం కనబర్చడం చూస్తే కారు షెడ్డుకి వెళ్ళిపోయినట్టే అనిపిస్తోంది.

తెలంగాణలో లోకసభ ఫలితాలు బీఆర్‌ఎస్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ రిజల్ట్స్‌ మీద పార్టీ వర్గాల్లో ముందు నుంచి పెద్దగా ఆశ లేకున్నా… చివరికి అంతకు మించి టాప్‌ టు బాటమ్‌ షేకయ్యేలా ఫలితాలు వచ్చాయన్నది ఇంటర్నల్ టాక్‌. ఇంత దారుణమైన పరాభవాన్ని లీడర్స్‌గాని, కేడర్‌గాని ఎవ్వరూ ఊహించలేదట. మాకు మంచి ఫలితాలే వస్తాయి… పరిస్థితి ఆశాజనకంగా ఉందని ఇన్నాళ్ళు పైమాటగా చెప్పుకున్నా…అంతర్గతంగా పార్టీలో చర్చ మాత్రం వేరే ఉంది. కనీసం రెండు లేదా మూడు ఎంపీ సీట్లు వస్తాయని భావించిందట అధినాయకత్వం. కానీ… ఎవ్వరి ఊహకు అందని ఫలితం వచ్చిందని నోరెళ్ళబెడుతున్నాయట బీఆర్‌ఎస్‌ వర్గాలు. అందుకు కొన్ని ఉదాహరణల్ని కూడా చెప్పుకుంటున్నారు. ఏ సీటు ఎలా పోయినా…మెదక్‌ ఎంపీని మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని అనుకున్నారట బీఆర్‌ఎస్‌ ముఖ్యులు. చివరికి అక్కడ గెలుపు సంగతి పక్కనబెడితే… మూడో స్థానానికి పడిపోవడంతో… పార్టీ పెద్దల బుర్రలు గిర్రున తిరిగిపోయాయట. గెలుస్తామనుకున్న సీటులో ఇలా జరిగిందేటంటూ తలలు పట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఆరు చోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినాసరే… సీటు బీజేపీ ఖాతాలో పడటం ఏంటన్నది ఆ పార్టీ నేతలకు అర్ధంకావట్లేదు. మరోవైపు పార్టీ ముఖ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో మెజార్టీలు కూడా పార్టీకి షాకిచ్చాయి. మాజీ మంత్రి హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నసిద్దిపేట సెగ్మెంట్‌ మెదక్ పార్లమెంటు పరిధిలోనే ఉంది. ఇక్కడ హరీష్‌రావుకు ఉన్న పట్టు, ట్రాక్‌ రికార్డ్‌ దృష్ట్యా… ఎంపీ సీటు గెల్చుకోవడానికి ఈ సెగ్మెంట్‌లో వచ్చే మెజార్టీ చాలని లెక్కలేసుకున్నారట. కానీ… ఆ లెక్కలు తప్పాయి. అదృష్టం తిరగబడింది. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ రావడం గులాబీ పెద్దలకు అస్సలు మింగుడు పడని వ్యవహారంగా మారిందని అంటున్నారు. సిద్దిపేట సెగ్మెంట్‌ వరకు బీజేపీకి 2వేల 678 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక ఇదే పార్లమెంట్ పరిధిలోని మరో కీలక అసెంబ్లీ నియోజకవర్గం గజ్వేల్‌.

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కూడా పార్టీకి 20 వేల లోపు ఆధిక్యం మాత్రమే వచ్చింది. ఈ స్టోరీ ఇలా ఉంటే.. అటు కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందంటున్నారు పరిశీలకులు. అలాంటి ఫలితాన్ని పార్టీ పెద్దలు అస్సలు ఊహించనేలేదన్నది ఇంటర్నల్‌ టాక్‌. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే సిరిసిల్ల సెగ్మెంట్‌లో బీజేపీకి 6వేల748 ఓట్ల లీడ్ రావడంతో ఏం మాట్లాడాలో కూడా అర్ధంగాక నోళ్ళు పెగలడం లేదట BRS నాయకులకు. ఇలా… పార్టీ పరంగా త్రిమూర్తుల్లాంటి ముగ్గురు ముఖ్యనేతల అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఫలితాలు కనిపించడంతో ముందు ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న ఆందోళన బీఆర్‌ఎస్‌లో పెరుగుతోంది. ఫలితాలపై కేటీఆర్‌ ఎక్స్‌ మెస్సేజ్‌ పెట్టడమే తప్ప…. మీడియా ముఖంగా స్పందించేందుకు నాయకులెవరూ ముందుకు రాకపోవడాన్ని బట్టే లోపలి వాతావరణాన్ని ఊహించుకోవచ్చు.