ysrcp Leaders: రాజకీయ అవకాశమే హద్దుగా..

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకూ రాజకీయ వేడి పెరిగిపోతుంది. ఒకవైపు పవన్ వారాహి యాత్ర.. మరోవైపు చంద్రబాబు పర్యటన ఈ రెండూ పాలకపక్షానికి తలనొప్పిగా మారాయి. ఇలాంటి తరుణంలో సొంత పార్టీ నేతల నుంచి తమ కుమారులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీఎంవో కు అర్జీలు వస్తున్నాయి. ఇవి ఇప్పుడు వైపీపీ అధిష్టానానికి తలనొప్పి కాస్త తలబొప్పి కట్టే విధంగా మారింది.

  • Written By:
  • Publish Date - August 21, 2023 / 09:51 AM IST

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ప్రస్తుతం గెలిచిన నాయకులు ఈ సారి ఎన్నికల్లో తమ కుమారులతో పోటీ చేయించాలని భావిస్తున్నారు. అసలే ప్రతి పక్షాల విమర్శలు, పవన్ యాత్రలు వైసీపీని ఇబ్బందికి గురిచేస్తుంటే.. ఈ యువ నాయకుల రాజకీయ తేరంగేట్రం పై వస్తున్న అభ్యర్థనలు కష్టంగా మారాయి. ఏ కొద్దిగా అటూ ఇటూ అయినా చంద్రబాబు సీఎం సీటును ఎగరేసుకొని పోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో గెలుపు గుర్రాలకు కాకుండా తమ కుమారులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రాజకీయ ఓనమాలు రాని వారికి ఓటు ఎవరు వేస్తారు అన్న అనుమానం వైసీపీ అధిష్టానాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.

పైగా ప్రతి పక్షాలు బలమైన సీనియర్ అభ్యర్థులను ఎమ్మెల్యే బరిలో దింపితే వారిని ఢీ కొట్టే సత్తా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఉంటుందా అనేది జగన్ ఆలోచిస్తున్న అంశం. అందుకే ఈ సారి మీరే నిలబడండి. వచ్చే ఎన్నికల్లో మీ కుటుంబ సభ్యులకు సీటును కేటాయిస్తామంటున్నారు. దీని వెనుక బలమైన కారణమే ఉంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే చంద్రబాబుకు వయసు పై బడింది. ఒకప్పటి లాగా యాక్టివ్ గా పనిచేయలేరు. ఇక లోకేష్ విషయానికొస్తే యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఆశించినంత ఫలితం రావడంలేదు. దీంతో ఈసారి వైసీపీ పరిపాలనా పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీ రూపురేఖలు లేకుండా చేయాలని భావిస్తున్నాయి. దీనిని అర్థం చేసుకోకుండా ప్రస్తుతం ఉన్న వైసీపీ నాయకులు తొందరపడితే అసలుకే నష్టం జరిగే అవకాశం ఉందని జగన్ వర్గం వారి వాదన.

సొంత పార్టీ కాకుంటే పక్క పార్టీ

జగన్ రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోలేని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ కొడుకులను యువనాయకులుగా చూడాలనే మోజులో పడి తప్పు చేస్తున్నారన్నది కొందరి వాదన. దీనికోసం వైసీపీలో టికెట్ రాకపోతే పక్కపార్టీలో అయినా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీలో యువనాయకులు కరువైన తరుణంలో వీరికి కచ్చితంగా టికెట్ ఇస్తారన్న నమ్మకం ఒక అంశమైతే.. జనసేన లో అభ్యర్థుల కొరతే ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చేస్తుందని మరికొందరి నమ్మకం. ఇలా వైసీపీలో జగన్ టికెట్ ఇవ్వకుంటే ఇతర పార్టీల నుంచి అభ్యర్థులుగా బరిలో దింపే అవకాశం ఉంది. వైసీపీలో ఉంటూ జగన్ పార్టీపైనే పోటీకి దింపేంత ధైర్యం నాయకుల్లో ఉందా.. ఒక వేళ ఉంటే వైసీపీ అభ్యర్థుల ధాటికి యువనాయకులు గెలవగలుగుతారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా డజనుకు పైగా నాయకులు తమ కుమారులను ఈ ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది తమ ధ్యేయంగా కనిపిస్తుంది.

రాజకీయ తేరంగేట్రానికి సిద్దమైన నాయకులు వీరే..

రాయలసీమ

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి తన కొడుకు కార్తీక్ రెడ్డిని శ్రీశైలం నుంచి బరిలోకి దింపేందుకు ప్రయత్నం.

పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు నరసింహా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.

పై రెండు స్థానాల్లో ఏదో ఒకటి తనకు ఇవ్వమని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కోరుతున్నారు.

ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవ రెడ్డి తన కొడుకుని బరిలోదింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి తన వారసుడిగా వీరధరణీధర్ రెడ్డిని ఎమిగనూరులో పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా

ఒంగోలు లోక్ సభ నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి పోటీకి సిద్దంగా ఉన్నారు.

ఒంగోలు ఎమ్మెల్యేగా బాలిరెడ్డి ప్రణీత్ రెడ్డిని బరిలో దింపేందుకు బాలినేని శ్రీనివాస్ పావులు కదుపుతున్నారు.

గోదావరి జిల్లాలు

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు సూర్యప్రకాష్, మంత్రి వేణుగోపాలకృష్ణ కుమారుడు నరేన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీ రామచంద్రపురం నుంచి బరిలో దింపేందుకు పోటీపడుతున్నారు.

మాడుగుల నుంచి బూడి ముత్యాల నాయుడు తన కుమార్తె అనూరాధను పోటీచేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర

గాజువాక నుంచి తన కుమారుడు వంశీని పోటీ చేయించేందుకు ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి పోటీపడుతున్నారు.

విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన కూతురు శ్రావణిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

యలమంచిలి ఎమ్మెల్యే రమణ మూర్తి స్థానంలో తన కుమారుడు సుకుమార్ శర్మకి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఇందులో కొందరు అధిష్టానానికి విన్నవించుకోగా మరి కొందరు టికెట్ రాకపోతే పక్క పార్టీల నుంచి బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

T.V.SRIKAR