ఆంధ్రప్రదేశ్ లో జీడిపాకం సీరియల్ లాగా కొనసాగిన టీడీపీ, బీజేపీ, జనసేన (TDP, BJP, Jana Sena) మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. ఈనెలలో మూడు పార్టీలు కూడా అన్ని నియోజకవర్గాలకు తమ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేస్తాయి. మోడీ, అమిత్ షా లాంటి నేతలతో బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సాధ్యం అవుతుందా ? అలా జరగకపోతే మళ్ళా వైసీపీయే అధికారంలోకి రావడం ఖాయం. ఓట్ల బదిలీ విషయంలో టీడీపీ ఇప్పటికే చాలాసార్లు దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితి రిపీట్ అవుతుందా… తమకు కాకుండా వేరే పార్టీ అభ్యర్థికి టిక్కెట్లు ఇవ్వడంతో… నియోజకవర్గాల్లో మిగతా పార్టీల లీడర్లు సహకరిస్తారా… ఇప్పుడిదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
1999లో బీజేపీ (BJP) తో టీడీపీ (TDP) పొత్తు పెట్టుకుంది. అప్పుడు సక్సెస్ అయింది. 2004లో ఓడిపోయింది. 2009లో టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలతో టీడీపీ పొత్తు వికటించింది. అప్పుడూ బాబుకు ఎదురు దెబ్బలు తగిలాయి. కానీ 2014లో బీజేపీతో పొత్తు కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం… ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న సందర్భాల్లో… ఓట్లు బదిలీ కరెక్ట్ గా జరిగినప్పుడే గెలిచింది. లేకపోతే ఓడిపోయింది. మరి 2024 ఎన్నికల పరిస్థితి ఏంటి ?
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో… జనసేన (JSP) , బీజేపీతో తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటుచేసుకుంది. ఆ రెండు పార్టీలకు 31 అసెంబ్లీ స్థానాలు 8 లోక్ సభ సీట్లు వదిలి పెట్టింది. గతంలో కంటే ఈసారి టీడీపీ ఎక్కువ సీట్లే మిత్రపక్షాలకు కేటాయించింది. అయితే తమకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని జనసేన పార్టీ నేతలు ముందు నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. కనీసం 50, 60 సీట్లయినా జనసేనకు వస్తాయని ఆశించారు. 24 అని చెప్పి… 21కే పవన్ సర్దుకుపోయారు. ఇప్పటికే జనసేన నుంచి ఒకరిద్దరు బయటకు వెళ్ళిపోగా… మిగిలిన నేతలు పవన్ కల్యాణ్ మీద గౌరవంతో బయటకు మాట్లాడటం లేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయం లేదు. రెండు పార్టీల నేతలు బహిరంగంగా బాహాబాహీకి దిగుతున్నారు.
బీజేపీ, టీడీపీ పరిస్థితి చూస్తే… ఈ రెండు పార్టీల నేతలకు కూడా నియోజకవర్గాల్లో సమన్వయం లేదు. పైగా చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు… బీజేపీ ఏ సాయం చేయలేదన్న కోపం కూడా తెలుగు తమ్ముళ్ళలో ఉంది. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన వల్ల టీడీపీ సీనియర్లకు టిక్కెట్లు రాని పరిస్థితి ఉంది. మరి వాళ్ళంతా మిగతా రెండు పార్టీలకు ఎంతవరకూ ఓట్లు వేయిస్తారన్నది డౌటే. పైగా ఆంధ్రప్రదేశ్ జనంలో చాలా మందికి బీజేపీ తమ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్న కోపం ఉంది. స్పెషల్ స్టేటస్ విషయంలో మోసం చేసిందని మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉప్పూ నిప్పూ లాగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన ఓట్లు మిగతా పార్టీలకు ఎలా బదలాయింపు జరుగుతాయి. ఎవరు ఎంతవరకూ సహకరిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఓట్లు బదిలీ కాకపోతే మాత్రం కూటమి హిట్టు కాదు ఫట్టవుతుంది. అందుకోసం మూడు పార్టీల నేతలు రాబోయే రోజుల్లో ఎవర్ని ఎలా బుజ్జగిస్తారన్నది చూడాలి.