ఆ విమర్శలు పట్టించుకోం రాహుల్ కు గంభీర్ సపోర్ట్

పుణే వేదికగా న్యూజిలాండ్ తో భారత్ రెండో టెస్టుకు ముందు సీనియర్ బ్యాటర్ కెెఎల్ రాహుల్ ఫామ్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న రాహుల్ ను తుది జట్టులో కొనసాగిస్తారా... లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

  • Written By:
  • Publish Date - October 24, 2024 / 03:48 PM IST

పుణే వేదికగా న్యూజిలాండ్ తో భారత్ రెండో టెస్టుకు ముందు సీనియర్ బ్యాటర్ కెెఎల్ రాహుల్ ఫామ్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న రాహుల్ ను తుది జట్టులో కొనసాగిస్తారా… లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బెంగళూరులో టెస్టులో గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడడం.. అదే సమయంలో రాహుల్ వైఫల్యం ఇప్పుడు తుది జట్టు కాంబినేషన్ ను క్లిష్టంగా మార్చింది. గిల్ జట్టులోకి రానుండడంతో సర్ఫరాజ్ ను కొనసాగిస్తారా, రాహుల్ పై వేటు వేస్తారా అనేది ఇంకా తెలియడం లేదు. తాజాగా కోచ్ గౌతమ్ గంభీర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. రాహుల్ పై విమర్శలు కొట్టిపారేసిన గంభీర్ అతనికి ఫుల్ సపోర్ట్ గా నిలిచాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్‌కు టీమిండియా అండగా ఉంటుందని గౌతీ తేల్చేశాడు. కాన్పూర్‌లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేశాడు.

కెఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్ ను తప్పించడం ఎంత వరకూ కరెక్ట్ అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపైనా గంభీర్ స్పందించాడు. భారత తుది జట్టును సోషల్ మీడియా డిసైడ్ చేయబోదన్నారు. అందుకే సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, ఏం అంచనాలతో ఉన్నారనే విషయాలను తాము పట్టించుకోమని తేల్చేశాడు. టీమ్ మేనేజ్ మెంట్ వ్యూహంతో పాటు జట్టు గెలుపే తమకు ముఖ్యమని గంభీర్ వ్యాఖ్యానించాడు. కొన్ని సందర్భాల్లో కొందరిపై కఠిన నిర్ణయాలు తప్పవంటూ హింట్ ఇచ్చాడు. గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ బెంచ్ కే పరిమితవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అనవసరం రాహుల్ కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారన్న విమర్శలను కూడా గంభీర్ కొట్టిపారేశాడు.

కాన్పూర్ పిచ్ పై అతను ఆడిన ఇన్నింగ్స్ ను మరిచిపోవద్దంటూ వ్యాఖ్యానించాడు. తుది జట్టులో బెస్ట్ ప్లేయర్స్ నే ఎంపిక చేసుకుంటామని, పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. కాగా బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అయితే బెంగళూరులో ఓడిపోయిన తర్వాత గ్రౌండ్‌ను వీడుతున్న టైంలో రాహుల్ చేసిన ఓ చర్య అనుమానాలకు తావిచ్చింది. తోటి ప్లేయర్లతో పెవిలియన్‌కు వస్తున్నప్పుడు పిచ్‌ను ముద్దాడాడు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో రాహుల్ హోంగ్రౌండ్ లో చివరి టెస్ట్ ఆడేసాడంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే టెస్టులకు గుడ్ బై చెబుతాడన్న వ్యాఖ్యలూ వినిపించాయి. 2014లో టెస్ట్ అరంగేట్రం చేసిన కెఎల్ రాహుల్ ఇప్పటి వరకూ 53 టెస్టుల్లో 2981 పరుగులు చేయగా.. దీనిలో 8 సెంచరీలున్నాయి.