RAINS IN AP, TG: ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ, తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే నాలుగు రోజులపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీకి సంబంధించి మూడు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
CHANDRABABU NAIDU: కుప్పంలో వాలంటీర్ల రాజీనామా.. చంద్రబాబుకు ఓటమి తప్పదా..?
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాల కారణంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా ఏపీలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పదిరోజులుగా ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదయం పది గంటలు దాటిందంటే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. పెరిగిన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న జనానికి వర్షాలు కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఏప్రిల్ ప్రారంభంలోనే ఏపీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం ఏడు జిల్లాలలో దాదాపుగా 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల 41 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. అయితే, ఈ మూడు రోజులు వర్షాల కారణంగా ఎండలు తగ్గడం కూడా కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలో బయట తిరగొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు.
బయటకు వెళ్లే వాళ్లు మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని.. వీలైతే మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలని చెబుతున్నారు. ఇంకోవైపు తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని అనేక చోట్ల 42 నుంచి 45 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పుల ప్రభావం కనిపిస్తోంది. ఉక్కపోత, వేడిమితో జనం అల్లాడుతున్నారు. ఏప్రిల్ ప్రథమార్థంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, మే నెలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. అయితే, తెలంగాణలోనూ ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో తెలంగాణ ప్రజలకు చిరుజల్లులు కాస్త చల్లదనాన్ని అందిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.