China: వరదనిచ్చిన వాన.. ఆహార సంక్షోభంలో చైనా..!

చైనా గడిచిన కొన్నేళ్లుగా ఏదో ఒక కారణంగానో లేక సమస్యతో వార్తల్లోకెక్కుతోంది. ఒకప్పుడు టెక్నాలజీ పరంగా నిలిస్తే మన్నటి వరకూ కోవిడ్ తో ప్రళయం సృష్టించింది. గతంలో వృద్ధ జనాభాతో విలవిలలాడిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు వర్షాలతో వణికిపోతోంది. భారీ వర్షాలతో పంటలన్నీ నీటమునిగాయి. దీని ప్రభావం ఆహార ఉత్పత్తులపై పడితే.. అన్నమో రామ చంద్రా అని పక్కదేశాల వైపు ఆకలి చూపులు చూడాల్సి వస్తుందా.. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 07:33 PM IST

చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య ప్రాంతంలోని పంటలన్నీ నీటమునిగాయి. ఈ దేశంలో దాదాపు 20శాతం ఆహార ధాన్యాలు ఇక్కడి నుంచే సాగు అవుతాయి. అలాంటి ప్రాంతాల్లో గత నెల నుంచి విపరీతమైన వర్షపాతం నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. బీజింగ్ హెబెప్రావిన్స్లో దాదాపు 30 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా జిలిన్ ప్రావిన్స్లోని షులాన్ నగరంలో 14 మందిని వరద పొట్టన పెట్టుకుంది. ఇలా మృత్యువాత పడ్డ వారిలో నగర డిప్యూటీ మేయర్ తో పాటూ ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లి వరదలో చిక్కుకొని మరణించారు. ప్రావిన్స్ రాజధాని హార్బిన్లో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 1.6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి పునరావాసం కల్పించినట్లు అక్కడి పభుత్వ మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఉత్తర చైనాలోని హెలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని 25 నదులు ప్రమాద స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరికి పేరుగాంచిన ఈప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగింది. అలాగే కూరగాయలు, ఆకుకూరలు పండించే గ్రీన్ హౌస్ లు గాలివాన హోరుకు ధ్వంసం అయ్యాయి. దాదాపు 90వేల హెక్టార్ల పంటలు పూర్తి స్థాయిలో నాశనం అయ్యాయి. అలాగే షాంఝీలో 42వేల హెక్టార్ల పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచానా వేశారు. దీని ప్రభావంతో చైనాలోని పలు రాష్ట్రాల్లో ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. హెనాన్ ప్రావిన్స్ లో మే నెలలో పడిన వర్షానికి పెద్ద ఎత్తున వరి పంట దెబ్బతింది. చైనా మొత్తానికి సరఫరా అయ్యే వరిలో మూడవ వంతు ఈ ప్రాంతంలో నుంచే సాగు అవతుంది. దీని ప్రభావం గోధుమల మీద కూడా పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

T.V.SRIKAR