ప్రకృతిని ప్రేమిస్తే మనల్ని కన్నబిడ్డలా చూసుకుంటుంది. అదే పాడు చేస్తే విషపు కోరలు చాచి మరణా మృదంగాన్ని మోగిస్తుంది. తాజాగా ఢిల్లీలో వాతావరణం వెరీ పూర్ స్థాయికి పడిపోయినట్లు వాయునాణ్యతా సూచీలు తెలుపుతున్నాయి. మన్నటి వరకూ తటస్థంగా ఉన్న వాతావరణం పరిస్థితులు ఆదివారం నాటికి తీవ్ర ప్రతికూలంగా మారిపోయాయి. ఏక్యూఐ అంటే వాతావరణంలో వాయు నాణ్యత సూచీ రేటు. శనివారం 248గా ఉండేది.. 24 గంటల వ్యవధిలో పశ్చిమ ఢిల్లీలోని షాదీపూర్ ప్రాంతంలో 370 కు చేరింది. దీంతో పరిస్థితి చెయిదాటిపోయేలా కనిపిస్తోంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచి గాలి వాతావరణంలో ఉన్నట్లు లెక్క. మన హైదరాబాద్లో చూసుకుంటే 150 నుంచి 180 లోపే ఉంటుంది. బెంగళూరులో 130 నుంచి 150 లోపు ఉంటుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఢిల్లీ పరిస్థితి ఏంటో.
ప్రత్యమ్నాయ చర్యలు..
ప్రస్తుత ఢిల్లీ వాతావరణ ప్రతికూలతల దృష్ట్యా పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. వాతావరణంలోని కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. ఇందులో భాగంగా నగరవాసులు వాహనాలు బయటకు తీసుకురాకుండా ఉండేందుకు పార్కింగ్ ఫీజులను విపరీతంగా పెంచాలని చూస్తోంది. హోటల్స్, రెస్టారెంట్లలో పొగ వెలువడే తందూరీ పోయ్యిలను నిషేధించింది. ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేస్తామని సూచిందింది. సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే రోడ్ల పైకి అనుమతిచ్చేలా నిబంధనలు తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరూ మెట్రో సేవలను వినియోగించుకోవాలని కోరింది. ఇందుకు గానూ మెట్రో రైలు సేవలను పెంచాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కాలుష్య కారక ధర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటూ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు మూతపడనున్నాయి. ప్రస్తుతం నిర్మించే నిర్మాణాలు, పడగొట్టే ప్రాజెక్టులపై ఆంక్షలు విధించింది. దుమ్ము, పొగ వెలువడకుండా పనిచేయాలని తెలిపింది.
T.V.SRIKAR