Aqua Industry: ఇంటి మిద్దెలపై చేపల పెంపకం.. లాభాల బాటలో వ్యాపార ప్రయాణం

గతంలో మిద్దెలపై తోటలు పెంచడం చూశాం. ఇంకొందరు వడియాలు ఆరబెట్టుకుంటూ ఉంటారు. అయితే తాజాగా చేపలు కూడా పెంచవచ్చని నిరూపించారు కామారెడ్డికి చెందిన మహిళలు.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 03:02 PM IST

వ్యాపారం చేయాలనే దృఢ సంకల్పం ఉండాలే గానీ అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. తమ ఇంటి మిద్దెలు ఖాళీగా ఉండటంతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన రేణుక, నీల రాజ్యలక్ష్మి అనే ఇద్దరు మహిళలు ఒక అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మహిళా సంఘంలోని సభ్యులు కావడంతో శ్రీనిధి స్కీంలో భాగంగా రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నారు. తమ ఇంటిపై రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. అక్కడ ఒక తొట్టె నిర్మించి అందులో చేపలు పెంచుతున్నారు. ఇవి సాధారణమైన చేపలు కావు. మేలురకం కొర మీను చేపలు. వీటికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. సీడ్ తెచ్చి పెంపకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఒక్కో చేప అర కిలో నుంచి కిలో వరకూ ఉన్నట్లు చెబుతున్నారు. తమకు చేపల పెంపకంలో గతంలో ఎలాంటి అనుభవం లేకున్నా చిన్న పాటి సూచనలు పాటించి ఆక్వా రంగాన్ని ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.

ఇలా చేయడం వల్ల గ్రామీణాభివృద్ది జరుగుతుందని దీనికి ప్రోత్సహించేలా బ్యాంకుల్లో, సహకార సంఘాల్లో రుణాలు సులువుగా దొరుకుతున్నాయంటున్నారు. అలాగే గ్రామీణాభివృద్ది అధికారులు కూడా మంచి ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో 56 యూనిట్లను ఏర్పాటు చేశారు. మరికొందరైతే తమ పొలాల్లోనే నీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకొని వీటి ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో నీటి ట్యాంకులో 1000 కి పైగా చేపలు పెంచేలా నిర్మాణాలను చేపడుతున్నారు. ఇవి కేజీకి పైగా బరువు పెరుగుతాయి. వీటి కేజీ ధర రూ. 350 నుంచి 450 మధ్య ఉంటుంది. ఇది కూడా చిన్న పాటి ఆక్వా పరిశ్రమలాగే ఉంటుంది. ఇందులో రెండు రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. ఒకటి చేపల అమ్మకం ద్వారా ఆదాయం పొందవచ్చు. అలాగే ఈ చేపలు ఉన్న నీటిని పొలాలకు ఎరువుగా ఉపయోగించుకుంటున్నారు. దీనికి కారణం ఇందులోని చేపల వ్యర్థాల్లో నత్రజని శాతం అధికంగా ఉంటుంది. తద్వారా భూమి సారం పెరిగి కేవలం 8 నెలల్లోనే మంచి పంట చేతికి వస్తుంది. ఈ నీటిని ప్రతి రెండు రోజులకు ఒక సారి మార్చాల్సి ఉంటుంది. ఇలా కూడా ఈ నీటిని అమ్మి లాభాలు పొందవచ్చు.

ఇలా చేసిన ప్రయోగం వల్ల కామారెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చినట్లు మండల అధికారులు చెబుతున్నారు. మరి కొందరు ముందుకు వచ్చి వీటిని ఉత్పత్తి చేయడం వల్ల రాష్ట్రంలో కామారెడ్డికి మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

T.V.SRIKAR