నేనూ.. నువ్వు ఇక్కడ ఫ్రెండ్స్.. అక్కడ మాత్రం నువ్వు వేరు.. నేను వేరు.. ఇలా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల వ్యవహారం. ఏపీలో పొత్తు పెట్టుకుంటే.. తెలంగాణలో పొత్తుల్లేవు.. కత్తులే. పైగా అక్కడి ఫ్రెండ్షిప్ పార్టీకి.. ఇక్కడ ప్రత్యర్థికీ ఓటేయమని చెబుతున్నాయి.. ఏంటీ గందరగోళం అనుకుంటున్నారా ?
తెలంగాణలో ప్రస్తుతం (Telangana elections) కంగాళీ రాజకీయం నడుస్తోంది.. పార్టీలు పొత్తులు (Alliances).. ఎత్తులు అయోమయంగా ఉన్నాయి. జనాన్ని పిచ్చెక్కిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ పోటీ చేయదు. కానీ పరోక్షంగా కాంగ్రెస్ కి ఓటేయమని చెబుతుంది. ఆంధ్రాలో ఆ పార్టీ భాగస్వామి జనసేన ( Janasena) .. ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆంధ్రాలో కలిసి పనిచేసే టీడీపీ.. జనసేన.. తెలంగాణలో మాత్రం వేరు వేరు పార్టీలకు సహకరిస్తాయి. చంద్రబాబు అరెస్ట్, జైలుకెళ్లిన తర్వాత.. టీడీపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీజేపీ కూడా తమతో కలసి రావాలని పిలుపు ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు ఏపీలో బీజేపీకి, టీడీపీకి మధ్య పొత్తు లేదు. భవిష్యత్తులో ఉంటుందని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. ఇంకా ఏదీ తేల్చలేదు.
ఇప్పుడు తెలంగాణలో టీడీపీ (TDP) పరోక్షంగా కాంగ్రెస్ కు ఓటు వేయమని చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి పోకుండా ఉండడానికి తాను పోటీ నుంచి తప్పుకుంది. ఏపీలో టీడీపీతో జత కట్టిన జనసేన ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. అంటే టీడీపీ ఓట్లు జనసేన లేదంటే.. ఆ పార్టీ మద్దతు ఇచ్చిన బీజేపీకి అయినా పడాలి. కానీ అలాంటి ప్రయత్నం ఏదీ జరగడం లేదు. టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడేలా ఉన్నాయి. ఇక బీజేపీకి పరోక్షంగా బీఆర్ఎస్ సహకరిస్తోంది. రేపు హంగ్ అసెంబ్లీ వస్తే.. BRS, BJP కలసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయన్న టాక్ కూడా నడుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల్లో మాత్రం.. కమలం, గులాబీ పార్టీలు ప్రత్యర్థులుగానే పోటీ చేస్తున్నాయి.
Kodandaram, Revanth Reddy : కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన తెలంగాణ జన సమితి పార్టీ.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి బీజేపీకి అండర్ స్టాండింగ్ ఉంది. కేంద్రంలో NDA సర్కార్ కు సహకారం అందిస్తోంది వైసీపీ. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు.. ఎన్నో బిల్లులకు ఆ పార్టీ సపోర్ట్ చేసింది. ఇప్పటికీ బీజేపీతో ఫ్రెండ్లీ రిలేషన్ నడుపుతోంది వైసీపీ. కానీ అదే ఏపీలో వైసీపీతో పోరాడే జనసేన NDAలో భాగస్వామిగా ఉంది. తెలంగాణలో బీజేపీ పొత్తు కూడా పెట్టుకుంటుంది.
రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నయన్నది అయోమయంగా ఉంది. అసలు ఎవరు ఎవరికి ప్రత్యర్థులు.? అనేది ఓటర్లకు అర్థం కాని పరిస్థితి. ఎవరు ఎవరితో పోరాడుతున్నారో తెలియడం లేదు. తెలంగాణలో ఒక నీతి.. ఆంధ్రాలో మరో నీతి అన్నట్టుగా ఉంది. నిజంగా ప్రస్తుతం కంగాలీ రాజకీయం నడుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో.