PAVAN SEATS : సామాజిక సమీకరణాల్లో పవన్ వీక్.. ఓసీలకు 12, బీసీలకు రెండే సీట్లు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) గట్టి పోటీ ఇస్తాడనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం 21 సీట్లకే పరిమితం అయ్యారు. టీడీపీ (TDP), బీజేపీ (BJP) తో కూటమి కట్టినందుకు ఎక్కువ సీట్లు త్యాగాలు చేశారు. దాంతో జనసేనను నమ్ముకొని మొదటి నుంచీ పనిచేస్తున్న వారికి అన్యాయమే జరిగింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) గట్టి పోటీ ఇస్తాడనుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం 21 సీట్లకే పరిమితం అయ్యారు. టీడీపీ (TDP), బీజేపీ (BJP) తో కూటమి కట్టినందుకు ఎక్కువ సీట్లు త్యాగాలు చేశారు. దాంతో జనసేనను నమ్ముకొని మొదటి నుంచీ పనిచేస్తున్న వారికి అన్యాయమే జరిగింది. ఇప్పటివరకూ ఏపీలో 18 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇంకా మూడు సీట్లు మాత్రమే అనౌన్స్ చేయాల్సి ఉంది. కానీ ఈ 18 సీట్లల్లో సామాజిక సమీకరణాలు పాటించలేదన్న విమర్శలు వస్తున్నాయి.

జనసేన (Janasena) ఇప్పటివరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు సీట్లు మాత్రమే బీసీల (BC) కు కేటాయించింది. మిగిలిన స్థానాల్లో 12 ఓసీలకు వెళ్ళాయి. అనకాపల్లి, నరసాపురం స్థానాల్లో మాత్రమే బీసీలకు ఎలాట్ చేసింది జనసేన. గోదావరి జిల్లాల్లో జనసేన కోసం ఐదేళ్ళుగా పనిచేస్తున్న బీసీ నేతలకు ప్రాధాన్యత దక్కలేదన్న విమర్శలు వస్తున్నాయి. బొలిశెట్టి సత్యనారాయణ, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేష్, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ లాంటి సీనియర్లకు పవన్ కల్యాణ్ టిక్కెట్లు ఇవ్వలేదు.

జనసేనలో 12 స్థానాలు ఓసీలకే ఇవ్వడమేంటని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సామాజిక న్యాయం పేరుతో… సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా మార్చేసింది వైసీపీ. గోదావరి జిల్లాల్లో బీసీలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. జనసేన మాత్రం విశాఖలో ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లాలో మరో సీటు మాత్రం బీసీలకు కేటాయించింది. ఇంకా మిగిలింది 3 స్థానాలే. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం సౌత్ సీట్లను జనసేన ప్రకటించాల్సి ఉంది. వీటిల్లో బీసీలకు వస్తాయన్న నమ్మకం కూడా లేదు.

అసలు గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న శెట్టి బలిజ వర్గానికి ఇప్పటి వరకు సీటు కేటాయించలేదు. ఈ వర్గానికి సీటు ఇవ్వాలని మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా గతంలో పవన్ కల్యాణ్ కి లెటర్ రాశారు. కాకినాడ మాజీ మేయర్ పోతనపల్లె సరోజ జనసేన సభ్యత్వానికి రిజైన్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు రెండు అసెంబ్లీ సీట్లు దక్కాయి. ఈ రెండింటిలోనూ కొత్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన 21 సీట్లల్లో ఒక్క మహిళకి మాత్రమే అవకాశం ఇవ్వడమేంటని సరోజ ప్రశ్నించారు. శెట్టిబలిజ వర్గానికి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా మైనార్టీలకు కూడా పవన్ సీట్లు కేటాయించలేదు. జనసేనలో శెట్టి బలిజతో పాటు గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబ, చేనేత కులాలకు కూడా చోటు దక్కలేదు.

భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీల నేతలకు ఇచ్చారు. టీడీపీ, బీజేపీతో పొత్తుల వల్ల సొంత అన్న నాగబాబుకు కూడా సీటు లేకుండా చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ ను ఆడుకుంటోంది. ఆయన సామాజిక న్యాయం మాటల్లోనే… చేతల్లో లేదంటూ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలకు పవన్ ఏం సమాధానం చెబుతారు మరి.