బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ ట్వంటీ సిరీస్ లోనూ అదరగొట్టింది. పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్ లలో విజయాల కంటే ముగింపు మ్యాచ్ హైదరాబాద్ లో టీమిండియా దుమ్మురేపిందనే చెప్పాలి. ఫ్లాట్ వికెట్ పై పూనకం వచ్చిన భారత బ్యాటర్లు వరల్డ్ రికార్డ్ స్కోర్ సాధించారు. సంజూ శాంసన్ విధ్వంసకర శతకంతో పాటు సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్స్ , రియాన్ పరాగ్ తో పాటు చివర్లో హార్థిక్ పాండ్యా మెరుపులతో ఏకంగా 297 పరుగుల భారీస్కోర్ సాధించింది. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు అందుకుంది. టీ ట్వంటీ క్రికెట్ లో మనకు ఇదే హయ్యెస్ట్ స్కోర్. అలాగే ఐసీసీ టెస్ట్ హోదా పొందిన జట్లలో హయ్యెస్ట్ టీ ట్వంటీ స్కోర్ చేసిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీ20ల్లో అత్యధిక బౌండరీల రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్ లో 47 బౌండరీలు నమోదయ్యాయి.
అలాగే టీ ట్వంటీ ఒక మ్యాచ్ లో బెస్ట్ పవర్ ప్లే స్కోర్ మాత్రమే కాదు… తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోరు, 200 మార్క్ అందుకున్న జట్టుగానూ రికార్డులలెక్కింది. ఇక టీ ట్వంటీల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన మూడో జట్టుగా ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో పాటు అత్యంత వేగంగా 100, 150, 200, 250 పరుగుల మార్క్‌ను అందుకున్న జట్టుగా చరిత్రకెక్కింది.
మరోవైపు ఈ సిరీస్ విజయంతో సొంతగడ్డపై మనకు తిరుగులేదని మరోసారి రుజువైంది. సొంతగడ్డపై భారత్ కు ఇది 16వ టీ ట్వంటీ సిరీస్ విజయం. 2019 నుంచి ఒక్క సిరీస్ ను కూడా టీమిండియా కోల్పోలేదు. అలాగే 10 కంటే ఎక్కువ వరుస సిరీస్ లు గెలిచిన జట్టుగానూ నిలిచింది. ఆస్ట్రేలియా 8 సిరీస్ విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ 16 సిరీస్ విజయాలు కోహ్లీ, రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యాతో పాటు ఇప్పుడు సూర్యకుమార్ కెప్టెన్సీలో వచ్చాయి.
అలాగే టీ ట్వంటీల్లో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగానూ నిలిచింది. టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్ గా నిలిచిన భారత్ అదే జోరు కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్ పై వరుసగా మూడు టీ ట్వంటీలు గెలవడం ద్వారా వరుసగా 10 విజయాలను అందుకుంది. మొత్తం మీద పొట్టి క్రికెట్ లో విశ్వవిజేతగా ఉన్న టీమిండియా ఇటు స్వదేశంలోనూ, అటు విదేశాల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది.