తమిళనాడు (Tamil Nadu) రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతోంది. దివంగత సీఎం జయలలిత (Jayalalitha) లేని లోటును భర్తీ చేసేందుకు స్టార్ హీరోలు ఒక్కొక్కరూ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా హీరో విశాల్ పొలిటికల్ అనౌన్స్ మెంట్ చేశారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. స్వయంగా ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపారు. 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని విశాల్ అంటున్నారు. రాష్ట్రంలోని ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని.. వారికోసం తాను అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు విశాల్.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్టాలిన్ (CM Stalin) వర్సెస్ హీరోలుగా మారుతోంది. ‘తమిళగ వెట్రిక్ కళగం’ (Tamilnaga Vetrik Kalagam) పేరుతో తమిళనాడులో రాజకీయ పార్టీ స్థాపించారు దళపతి విజయ్ (Dalapathy Vijay). 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు విజయ్ చెప్పారు. 2026 ఎన్నికల్లోనే (Tamil Assembly Elections) అమీ తుమీ తేల్చుకోనున్నట్టు తెలిపారు. పార్టీ నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.
ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ నాయకత్వంలో ఇప్పటికే మక్కళ్ నీది మయ్యం… MNM ఏర్పడింది. కమల్ హాసన్ పార్టీ కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో అధికార డీఎంకే (DMK) కి మద్దతు ఇవ్వాలని MNM పార్టీ తీర్మానించింది. అందుకు ప్రతిఫలంగా, 2025లో MNM పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఖాయమైందని తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది కమల్ పార్టీ. అయితే స్టాలిన్ తో కలిసి పోటీ చేస్తుందా… ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అనేది చూడాలి.
మొత్తానికి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మాత్రం స్టార్ వార్ ను తలపిస్తున్నాయి. విజయ్, విశాల్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? ఎవరికి వారే ఒంటరిగా బరిలోకి దిగుతారా అన్నది ఉత్కంఠగా మారింది. మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని విశాల్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ఆయన నో అని చెప్పారు. ముందుగా ప్రజల్లో తాను ఏంటో నిరూపించుకోవాలన్న విశాల్… ఆ తర్వాతే ఎన్నికల పొత్తు గురించి ఆలోచిస్తానని అన్నారు. అయితే, విజయ్, విశాల్ ఎవరికి వారే పోటీ చేసే అవకాశం వుందని వారి సన్నిహితులు చెబుతున్నారు.
జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నాడీఎంకే ఉన్నా చీలికలు, పేలికలైంది. పాపులర్ లీడర్ ఒక్కరూ ఆ పార్టీలో లేరు. దీంతో డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ తో తలపడే నాయకత్వం తమిళ పాలిటిక్స్ లో స్పష్టంగా కనపడుతోంది. ఆ లోటును భర్తీ చేసేందుకు మొన్న విజయ్ ఒక పార్టీ పెడితే, ఇప్పుడు విశాల్ కూడా రంగంలోకి దిగాడు. ఇద్దరూ తమ లక్ష్యం 2026 అనేశారు. దీంతో 2026 ఎన్నికల్లో స్టార్ హీరోలతో తలపడనున్నారు స్టాలిన్. అయితే, ఇద్దరూ హీరోలు కలిసి పోటీ చేస్తారా… లేదంటే విడివిడిగా పోటీ చేసి ఓట్లు చీలికకు కారణమై…అంతిమంగా స్టాలిన్ కే లాభమయ్యేలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు హీరో అజిత్ ను అన్నా డీఎంకే లో చేరాల్సిందిగా ఎప్పటినుంచో అడుగుతున్నారు ఆ పార్టీ నాయకులు.
అజిత్ కు జయలలితతో సత్సంబంధాలు ఉండేవి. ఒకప్పుడు తరచూ ఆయన అమ్మతో సమావేశం అవుతుండేవారు. జయలలిత తర్వాత అన్నా డీఎంకేను అజిత్ నడిపిస్తారని అప్పట్లో అందరూ భావించారు. కానీ జయ మరణం తర్వాత అజిత్ పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. రాజకీయాల వైపు చూడలేదు. 2026 కైనా అజిత్ మనసు మార్చుకొని అన్నాడీఎంకి పగ్గాలు పట్టుకుంటారని ఆ పార్టీ లీడర్లు ఆశపడుతున్నారు. మొత్తానికి 2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులో ఉత్కంఠగా మారబోతున్నాయి.