పొత్తు అక్కర్లేదని తేల్చి చెప్పి.. గులాబీ బాస్ కేసీఆర్ వామపక్షాల తిక్క కుదిర్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కమ్యూనిజం అంటే సామాజిక ప్రయోజనాలను ఆకాంక్షించే విశాల ఆలోచనా దృక్పథం. కానీ తెలంగాణలోని వామపక్ష పార్టీలు అందుకు పూర్తి విరుద్ధంగా సంకుచిత భావజాలంతో ముందుకు సాగుతున్నాయి. మునుగోడు బై పోల్స్ లో వాటి తీరు బయటపడింది. అంగబలం, అర్ధబలం లేదనే ఒకే ఒక్క కారణంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీని వద్దని, శక్తివంతుడైన కేసీఆర్ తో కామ్రేడ్లు జట్టు కట్టారు. ఇప్పుడు కేసీఆర్ నో చెప్పడంతో.. మళ్లీ కాంగ్రెస్ వైపు ఎర్రదండు చూస్తోంది. ఈవిధంగా అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా వామపక్షాలు మారడం శోచనీయమనే టాక్ ప్రజల్లో నడుస్తోంది. బలమైన క్యాడర్ లేకున్నా, ఎమ్మెల్యేల బలం లేకున్నా.. దిగజారుడు రాజకీయాలకు కమ్యూనిస్టులు తెరతీయడం ఆందోళనకర పరిణామమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వామపక్ష పార్టీలలోని అవకాశవాద వైఖరి వల్లే వాటితో పొత్తుకు కేసీఆర్ నో చెప్పారనే వాదన కూడా వినిపిస్తోంది.
సర్వేలో నెగెటివ్ రిపోర్ట్..
నాడు మునుగోడు బైపోల్ లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ కు లేదని చెప్పిన వామపక్షాలు.. నేడు అదే హస్తం పార్టీతో చెయ్యి కలిపేందుకు రెడీ అవుతున్నాయి. ఈ పరిణామాన్ని కమ్యూనిస్టు పార్టీల క్యాడర్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే వామపక్షాల ఎంతోమంది కీలక నేతలు బీఆర్ఎస్, కాంగ్రెస్ లలో చేరిపోయారు. రానున్న రోజుల్లో ఈ పతనం పరాకాష్టకు చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో కమ్యూనిస్టులకు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో చెరో సీటు ఇవ్వడానికి రెడీ అయిన కేసీఆర్.. ఆ స్థానాల్లో సర్వే చేయిస్తే వాటికి అక్కడ బలం లేదని రిపోర్ట్ వచ్చిందట. కామ్రేడ్లతో పొత్తు వల్ల రాష్ట్రంలోని ఇతర స్థానాల్లోనూ పెద్దగా ప్రయోజనం ఉండదని తేలిందట. దీంతో ఇక ఆ పార్టీలతో పొత్తు గురించి ఆలోచించడం కూడా టైమ్ వేస్టేనని ఒపీనియన్ కు గులాబీ బాస్ వచ్చారట. కామ్రేడ్లతో పొత్తు కంటే కీలకమైన సామాజిక వర్గాలను దగ్గరకు చేర్చుకోవడం ప్లస్ పాయింట్ అవుతుందనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ కొత్త లెక్క..
షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేస్తే కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి హస్తం పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు తగ్గుతాయని బీఆర్ఎస్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే ఇండియా కూటమిలో మిత్రపక్షంగా ఉన్న వామపక్షాలు తెలంగాణలోనూ కలిసికట్టుగా ముందుకు సాగే అవకాశాలే ముమ్మరంగా ఉన్నాయి. ఒకవేళ కామ్రేడ్స్ ఒంటరిగా పోటీచేసినా.. చాలా స్ట్రాంగ్ గా మారిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోవడం చాలా కష్టం. రిజల్ట్స్ సాధించడం ఇంకా కష్టం.