తెలంగాణలో రాజకీయం ఒక సామాజిక వర్గం రంగును పులుముకుంటుంది. దీని కేంద్రంగానే అన్ని పార్టీలు తమ భవిష్యత్తును తేల్చుకోబోతున్నాయి. మన్నటి వరకూ సంక్షేమం, అభివృద్ది, అప్పుల రాష్ట్రం అంటూ తన నిరసన గళాన్ని వినిపించిన కాంగ్రెస్.. తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏమైనా పాకిస్తానా..? హైదరాబాద్లో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంది. చంద్రబాబు వల్లే హైదరాబాద్ ఐటీ అభివృద్ది జరిగింది. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. కమ్మ సామాజిక వర్గం వాళ్లే కాదు అన్ని వర్గాల వాళ్లు చంద్రబాబు కోసం ఆందోళన చేస్తున్నారు. వారిని అడ్డుకోవడం అన్యాయం అన్నారు. తెలంగాణ ఏమైనా పాకిస్తానా..? అని ప్రభుత్వం పై కోమటి రెడ్డి మండిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. ఇక రేణుకా చౌదరి అయితే చంద్రబాబు అరెస్ట్ నుంచి జగన్ పాలన వరకూ ఏకిపడేశారు. తెలంగాణ రాజకీయం మొత్తం చంద్రబాబు చుట్టే తిరగడానికి కారణం ఏంటి అనే అనుమానం మీలో కలుగ వచ్చు.
బీఆర్ఎస్ పై ఆగ్రహం..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తొలి రోజు నుంచి హైదరాబాద్ లో నిరసనలు వెల్లువెత్తాయి. దీనికి కారణం ఏపీ నుంచి ఇక్కడికి వచ్చిన సెట్లర్స్. వీరు చంద్రబాబుపై అభిమానంతో పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిని బీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎలాంటి ర్యాలీలు, నిరసనలు తెలిపేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. గతంలో చేసిన కారు ర్యాలీలను అడ్డుకుంది. దీంతో ఐటీ ఉద్యోగులందరూ బీఆర్ఎస్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనిని ఇంతటితో వదలకుండా.. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో అరెస్ట్ అయితే ఇక్కడ నిరసనలు తెలుపడం ఏంటి అని ప్రశ్నించారు. అంతగా అభిమానం ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి నిరసన తెలపండి అన్నారు. దీంతో ఇక్కడి సెట్లర్స్ కు మరింత ఆగ్రహం తెప్పించింది. బీఆర్ఎస్ అని పేరు మార్చుకుని జాతీయ స్థాయి పార్టీ లక్షణాలను కలిగి ఉండాల్సింది పోయి టీఆర్ఎస్ లాగా ప్రాంతీయ ప్రయోజనాలనే కోరుకుంటుందని విమర్శించారు. ఈ తరహా భావనతో జాతీయ పార్టీగా రంగు మార్చుకుని రేపు ఏపీలో ఎలా పోటీ చేస్తారని నిలదీశారు. పైగా మన్నటి మెట్రో ఘటనలో పోలీసు అధికారులు ఒక ఐటీ ఉద్యోగిపై చేయి చేసుకున్నారనే వార్తలు సంచలనంగా మారింది. ఈ వరుస సంఘటనల నడుమ బీఆర్ఎస్ కి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందనేది కాంగ్రెస్ భావన.
ఓటు బ్యాంకుగా మర్చుకునే ప్రయత్నం..
ఏపీ నుంచి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిన వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది టీ-కాంగ్రెస్. ఈ ముసుగులో కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ కార్డును వాడుకుంటోంది. బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తద్వారా కేసీఆర్, కేటీఆర్ పై గుర్రున ఉన్న కమ్మ సామాజిక వర్గంతో పాటూ ఇక్కడ సెటిల్ అయిన వారి ఓట్లు తమకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. పైగా ఇప్పటి వరకూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించ లేదు. గతంలో ఖమ్మంతో పాటూ కొన్ని ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆ తరువాత అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో ఎలాంటి అప్డేట్ లేదు. పైగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నామినేషన్ కి నెల గడువు కూడా లేదు. అయినప్పటికీ ఎలాంటి చలనం లేకపోవడంతో టీడీపీ ఓటును ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఓట్లన్నీ చీలకుండా ఉండాలంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్రత్యమ్నాయం అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.
T.V.SRIKAR