కొత్త వాళ్ల రాక.. పాత వాళ్లను ఆపలేక.. షర్మిల పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు పాపం ! వైటీపీని రాజకీయ పార్టీగా గుర్తించడానికి కూడా ఇష్టపడడం లేదు చాలామంది! ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు మొదలుపెట్టారన్న చర్చ మొదలైంది. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు డీకే శివకుమార్‌తో భేటీ కావడం.. ఫ్యామిలీ ఫ్రెండ్ కేవీపీని మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకోవడం.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ప్రపోజల్ పెట్టడం.. వాళ్లు ఓకే చెప్పడం.. చకచకా జరిగిపోయాయనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందనే ప్రచారం మొదలైంది.
జూలై 8న ఇడుపులపాయ వేదికగా షర్మిల ప్రకటన చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇడుపులపాయకు వస్తారని.. వారి సమక్షంలోనే విలీనానికి సంబంధించిన ప్రకటన షర్మిల చేస్తారని జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికంటే ముందు రాహుల్, సోనియాతో షర్మిల, విజయమ్మ.. ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అవుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఐతే ఇందులో నిజం ఎంత.. అబద్దం ఎంత అన్న సంగతి ఎలా ఉన్నా.. ఒక్కటి మాత్రం క్లియర్‌గా అర్థం అవుతోంది. అదే కాంగ్రెస్‌లోకి షర్మిల వెళ్లిపోవడం. వెళ్లడం లేట్ అవుతుందేమో కానీ.. వెళ్లడం మాత్రం పక్కా అనే చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
షర్మిలను పార్టీలోకి ఆహ్వానిస్తే.. వైఎస్ అభిమానుల మద్దతు లభిస్తుందన్నది కాంగ్రెస్ ప్లాన్. దీనికితోడు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు కీ రోల్ ఇస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి మళ్లీ జీవం పోయొచ్చు అన్నది హస్తం పార్టీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకోవడానికి పెద్దగా ఆలోచించలేదు ఎవరూ ! ఐతే ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. రేవంత్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అని ! తెలంగాణ వచ్చింది.. తెలంగాణవాళ్లు పాలించుకోవడానికి అని.. పొరుగు రాష్ట్రం వాళ్లు వచ్చి పాలిస్తానంటే ఎలా అని బహిరంగంగానే కామెంట్లు చేశారు రేవంత్ చాలాసార్లు.
తాను పార్టీలో ఉన్నంత వరకు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండబోదని మీడియా ముందే చెప్పేశారు. కాంగ్రెస్‌లోకి షర్మిల ఎంట్రీ మీద రేవంత్ మినహా.. దాదాపు అందరూ పాజిటివ్‌గానే ఉన్నారు. ఇప్పుడు షర్మిల పార్టీలోకి వస్తే రేవంత్ రియాక్షన్ ఏంటి అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న. ఒక్కటి మాత్రం నిజం.. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా.. కాంగ్రెస్‌లో ఢిల్లీ పెద్దలు చెప్పిందే ఫైనల్. మరి షర్మిల విషయంలో ఢిల్లీ పెద్దల మాట ఫాలో కావడంలో రేవంత్ ఎలా ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.