BRS Politics: పైలట్ వర్సెస్ పట్నం.. టికెట్ వార్ లో జరగబోయేది అదేనా ?

తాండూరు పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎన్నికల సమయానికి అవి ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఊహించడం కష్టంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి మీడియాకు వస్తున్న లీక్స్ లోని సమాచారాన్ని బట్టి తాండూరు టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే ఇస్తారని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 07:18 AM IST

తాండూరు పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎన్నికల సమయానికి అవి ఎలాంటి మలుపు తీసుకుంటాయో ఊహించడం కష్టంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి మీడియాకు వస్తున్న లీక్స్ లోని సమాచారాన్ని బట్టి తాండూరు టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే ఇస్తారని తెలుస్తోంది. అంతమాత్రాన ఆ అసెంబ్లీ టికెట్ కోసం ఇతర ఆశావహుల ప్రయత్నాలు ఆగినట్టు కాదు.. బీఆర్ఎస్ పార్టీ ఆ లీకులపై అధికారిక ముద్ర వేసినట్టు కాదు !! బీఆర్ఎస్ నుంచి ఈ టికెట్ ను ఆశిస్తున్న వారిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. 1994, 1999, 2009, 2014 అసెంబ్లీ పోల్స్ లో తాండూరు నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి .. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈ పోల్స్ లో గెల్చిన ఏడాది తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అప్పటి నుంచి తాండూరు బీఆర్ఎస్ లో పైలట్, పట్నం వర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఓ వైపు పైలట్ ను పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్ పార్టీ.. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చింది.

ఆ ముగ్గురే బరిలో..

అసెంబ్లీ పోల్స్ సమీపించిన ప్రస్తుత తరుణంలో ఈసారి టికెట్ తనదంటే తనదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎవరికి వారుగా ప్రకటించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య నలిగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం ఇద్దరిని పక్కన పెట్టి.. బీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ హ్యాండిస్తే.. పట్నం మహేందర్ రెడ్డి హస్తం పార్టీకి జైకొడతారనే ప్రచారం నడుస్తోంది. ఈ ప్రచారాన్ని ఇప్పటిదాకా మహేందర్‌రెడ్డి ఖండించకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి పైలట్ బరిలోకి దిగితే.. ఆయనకు ప్రత్యర్థిగా మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున రంగంలోకి దిగుతారని అంటున్నారు. వీరిద్దరిపై బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వరరెడ్డిని పోటీకి నిలుపుతారనే సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. పదేళ్ల క్రితం ఒకే గొడుగు కింద ఉన్న ఈ ముగ్గురు లీడర్లు.. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున ప్రత్యర్థులుగా మారతారనే ప్రచారం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది.

ఎమ్మెల్యే టికెట్ రేసులో ఎందరో ఎమ్మెల్సీలు..

అసెంబ్లీ టికెట్స్ ను ఆశిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీల లిస్టు పెద్దదే ఉంది. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్స్ ను ఆశిస్తున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి , మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఈ రేసులో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆ టిక్కెట్ తనదే అని చెప్పుకుంటూ ఆయన నియోజకవర్గమంతా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హుజురాబాద్ అసెంబ్లీకి పోటీ చేయాలనే పట్టుదలతో ఉండగా, తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ ఈసారి నాంపల్లి , అంబర్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోటు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసే ప్లాన్ లో ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్ , మన్నే కృశాంక్, గజ్జల నగేష్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిని వచ్చే ఎన్నికల్లో టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అలాగే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నారు.