Old Women: నేటి యుగంలో నాటి కాలం వృద్ధురాలు.. ఈమె వయసు 123 ఇప్పటి వరకూ తలనొప్పి కూడా ఎరుగదు..

ప్రస్తుత యుగంలో సగటు వ్యక్తి ఆయుర్ధాయము 60 గా లెక్కకట్టారు. కానీ ఇక్కడ ఒక బామ్మ 123 ఏళ్లు వచ్చినప్పటికీ జీవించే ఉన్నారు. దీంతో ప్రపంచం చూపు మొత్తం అమె వైపుకు మళ్లింది. ఇంత వృద్దాప్యంలో కూడా చాలా చురుగ్గా ఉన్నారు. ఎలాంటి రోగాలు ఆమె చెంతకు చేరవట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తలపై ఒక్క వెంట్రుక కూడా తెల్లబడలేదు. ఇంతటి పండు ముసలవ్వ పై మనం ఒక లుక్కేద్దాం.

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 02:29 PM IST

ఇప్పటి యువతలో 30 ఏళ్లకే కీళ్లనొప్పులు, నడుము నొప్పులు, బీపీ, షుగర్, ఎసిడిటీ వంటి వ్యాధులను ఆస్తులుగా తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వందేళ్లు బ్రతకడం అంటే అది పెద్ద జోక్ గా భావిస్తారు నేటి తరం. దీనికి కారణం ప్రస్తుత సమాజంలో లభించే ఆహారం, అలవాట్లు ఈ రెండింటిని ప్రదాన కారణాలుగా చెప్పాలి. ఎందుకంటే పోషక విలువలతో కూడిన దినుసులు ఎక్కడా లభించడం లేదు. అన్నీ హైబ్రీడ్ రకం, సంకరజాతి కొత్త వంగడాలనే తింటున్నాం. ఇక అలవాట్ల విషయానికి వస్తే రాత్రి ఉదయిస్తూ.. ఉదయం అస్తమించేలా దినచర్యను మార్చేసుకున్నారు. ఇంటిలోని చిన్న పాటి పనిని కూడా మెషీన్ల సహాయంతో చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వందేళ్లు ఎలాంటి రోగాలు లేకుండా బ్రతకడం అంటే గొప్ప రికార్డ్ గా భావిస్తారు. ఈ రికార్డ్ ను సాధించారు బ్రెజిల్ దేశానికి చెందిన ఒకరు.

ఈమె పేరు అమంతినా దోస్ శాంటోస్ డువిర్జెమ్. మనకు ఈ పేరు పలికేందుకే కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే కొత్తగా వింతగా ఉంది. ఈమె లైఫ్ స్టైల్ ఇంకా విచిత్రంగా ఉంటుంది. బ్రెజిల్ దేశంలో పరానా రాష్ట్రానికి చెందిన సెర్రాగాయాస్ అనే ఊళ్లో 1900 జూన్ 22న పుట్టారు. అంటే గత 10 రోజు క్రితమే 123 వ ప్రాయంలోకి అడుగు పెట్టారనమాట. ఈమె పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. అలాగే బ్రెజిల్ దేశ అధికారులు ప్రపంచంలోని అత్యంత వృద్ధురాలిగా కూడా కితాబిచ్చారు. అంతేకాదండోయ్ ప్రభుత్వం నుంచి పింఛన్ కూడా అందుకుంటున్నారు శాంటోస్. ఇలా పింఛన్ అందుకున్న కారణంగా తన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోల్పోవల్సి వచ్చింది. దీనికి కారణం ప్రభుత్వ అధికారులు బర్త్ సర్టిఫికేట్ జారి చేయడం వల్ల వయసులో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించలేకపోయారు. ఇప్పుడు ఉన్న ప్రపంచ వృద్ధమహిళ వయసును 116 ఏళ్లుగా తెలిపారు గిన్నీస్ బుక్ అధికారులు. ఆవిడ పేరు బ్రాన్యాస్, అమెరికాలోని స్పానిష్ నగరంలో నివాసం ఉంటున్నట్లు ప్రకటించారు. దీనికి బ్రెజిల్ అధికారులు స్పందించి గిన్నీస్ బుక్ ఈ 123 ఏళ్ల బామ్మను గుర్తించినా.. గుర్తించకపోయినా ప్రపంచంలో అత్యంత వృద్ధమహిళ అమంతినానే అంటున్నారు.

ఈ రికార్డుల విషయం కాస్త పక్కన పెడితే.. ఈమె ఆహారపు అలవాట్లను ఒకసారి పరిశీలిద్దాం. ఈమె ఒంటరిగా నివాసం ఉంటూ తానే స్వయంగా వండుకుని తింటారు. ఎక్కువగా పెండలం దుంపల (ఆప్రాంతంలో పండే ఒకమైన పదార్థం) పిండితో చేసే కేకు తింటారు. అలాగే బాయిల్డ్ ఎగ్ అంటే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు. ఇంత వయసు పైబడినప్పటికీ ఈమెకు బీపీ, షుగర్, హార్డ్ ఎటాక్, అల్సర్, చివరకు తలనొప్పి కూడా ఎప్పుడూ రాలేదంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి వారు ఇక పై ఈ భూమి మీద ఎందరు సాక్షాత్కరిస్తారో వేచి చూడాలి. ఏదైనా ఆటలోనో, జీవింతంలోనో పోటీ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వయసుతో, ఆరోగ్యంతో, జీవన ప్రయాణంలో పోటీ పడుతున్నారు కొందరు శతాధీక వయస్కులు అని చెప్పాలి.

T.V.SRIKAR