Malkaj Giri , Parliament : దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ లో.. ఎవరిది గెలుపు..?

మల్కాజ్ గిరి (Malkaj Giri) పార్లమెంట్ నియోజకవర్గంలో దేశంలో అతి పెద్దది. ఇక్కడ గెలుపును మూడు ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి.

మల్కాజ్ గిరి (Malkaj Giri) పార్లమెంట్ నియోజకవర్గంలో దేశంలో అతి పెద్దది. ఇక్కడ గెలుపును మూడు ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. సిట్టింగ్ సీటు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) … మోడీకి గిఫ్ట్ గా ఇవ్వాలని బీజేపీ(BJP), ఈ పార్లమెంట్ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచిన ఉత్సాహంతో బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నాయి. గ్రేటర్ లో పట్టు సాధించడానికి మల్కాజ్ గిరి సీటు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి (Sunita Mahender Reddy), బీజేపీ తరపున ఈటల రాజేందర్, BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి… ఈ ముగ్గురు పవర్ ఫైట్ ఎలా ఉండబోతోంది. ఎప్పుడూ మార్పును ఆహ్వానించే మల్కాజ్ గిరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు.

దేశంలోనే అతి పెద్దది మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం. మినీ భారత్‌గా పేరొందిన ఈ నియోజకవర్గంలో 37 లక్షల 79 వేల మంది ఓటర్లు ఉన్నారు. GHMC పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్ సభ నియోజకవర్గంలో ఉన్నాయి. మేడ్చల్, మల్కాజి గిరి, కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, కంటోన్మెంట్, ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించింది ఉంది.

మల్కాజ్ గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, BRS అభ్యర్థులతో పాటు మొత్తం 37 మంది బరిలో ఉన్నారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్‌ నుంచి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మధ్యే పోటీ కొనసాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala Rajender) గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్‌ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి… జెడ్పీ చైర్‌పర్సన్‌గా మూడు సార్లు పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు BRS లో చేరిన రాగిడి… ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ముగ్గురు నేతలూ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటూ… గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ మల్కాజ్ గిరి ఓటర్లు మార్పును ఆహ్వానిస్తున్నారు. దాంతో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కనిపిస్తోంది.

మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంను 2019లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్‌ స్థానం తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్‌ కి ప్రతిష్టాత్మకంగా మారింది. సునీతా మహేందర్‌రెడ్డి మొదట చేవెళ్ల నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం మల్కాజిగిరి టికెట్‌ ఇచ్చింది. మహిళ కావటం, కాంగ్రెస్ అధికారంలో ఉండటం, brs సహా ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరటం సునీతకు కలిసొచ్చే అంశమని అంటున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలందర్నీ స్వయంగా రేవంత్‌రెడ్డే సమన్వయం చేస్తున్నారు. దాంతో సునీత గెలుపు ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. లోక్ సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీసుకున్నారు.

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో BRS అభ్యర్థులే గెలిచారు. కంట్మోనెంట్‌ ఎమ్మెల్యే ఈమధ్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ అసెంబ్లీ ఉపఎన్నిక కూడా జరుగుతోంది. దాంతో ఇక్కడ గెలుపును BRS ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ BRSకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాగిడి గెలుపు కోసం సరిగా ప్రచారం చేయడం లేదన్న విమర్శలున్నాయి. లోపాయికారీగా కాంగ్రెస్ అభ్యర్థికి సహకరిస్తున్నట్టు సమాచారం. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం కేటీఆర్ తరుచుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

మల్కాజ్ గిరి లోక్ సభలో పోటీకి ఈటెల రాజేందర్ కు అనూహ్యంగా బీజేపీ టికెట్‌ దక్కింది. సీనియర్ పొలిటీషియన్ అయిన ఈటల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. కాకపోతే ప్రధాని మోడీ ఇమేజ్, హిందూత్వ నినాదం కలిసొస్తాయని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన బీజేపీ నేతలు కూడా ఈటల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాని మోడీ ఇక్కడ ఇప్పటికే రోడ్‌ షో నిర్వహించారు. కేంద్ర మంత్రులు కూడా కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఈటల కూడా సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో గెలిచిన రాజకీయ నాయకులు ఎంతో ఉన్నత పదవులను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పని చేశారు. అదే సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిన నాయకులకు కూడా రాజకీయ రంగంలో మేలు జరిగిందని అంటారు. సర్వే సత్యనారాయణకు కేంద్ర మంత్రి, చామకూర మల్లారెడ్డికీ పదవులు లభించాయి. అలాగే 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన రేవంత్ రెడ్డి తర్వాత పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టారు. మొన్నటి ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ తప్ప మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రైవేట్ లోనూ ఇంజనీరింగ్, ఫార్మా, ఫుడ్‌ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.