రాష్ట్రంలో ఎలాగైనా పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని ఫిక్స్ అయిన కేసీఆర్.. ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయే ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులతో పర్యటనలు చేయిస్తూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాలవారీగా సర్వేలు చేయిస్తూ, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఓ అంచనాకు వస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు రకరకాల వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఏ ఒక్క విషయంలోనూ అవకాశం ఇవ్వొద్దు అనే పట్టుదలతో కేసీఆర్ దూసుకుపోతున్నారు.
సంక్షేమమే గెలిపిస్తుందనే ధీమాతో ఉన్న కేసీఆర్.. ఈసారి మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఆసక్తికర విషయం ఒకటి తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అవుతోంది. ఈసారి మేనిఫెస్టో లేకుండానే.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్త మేనిఫెస్టోను ప్రకటిస్తే.. కచ్చితంగా కొత్త హామీలను ప్రకటించాల్సి వస్తుంది. ఐతే వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా.. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను జనాలకు అందిస్తున్నామని.. వాటిని మరింత మెరుగ్గా అందిస్తామని జనాలకు వివరించగలిగితే సరిపోతుందనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారని టాక్.
ఇదే విషయంపై ఆర్థిక, సామాజిక రంగాల నిపుణులు సలహాలను కూడా కేసీఆర్ తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు సార్లు అధికారంలోకి ఉన్న పార్టీగా.. ఎన్నికలకు వెళ్లే సమయంలో కొత్త హామీలను ఇవ్వడం కంటే… ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని చెప్తే జనాలు సానుకూలంగానే స్పందిస్తారని అంచనా వేస్తున్నారట కేసీఆర్. ప్రస్తుతం కొత్త హామీలను ప్రకటించి అమలు చేస్తామని చెప్పినా.. ఆర్థికపరమైన ఇబ్బందులు దృష్ట్యా కొత్త మేనిఫెస్టోను ప్రకటించడం కంటే పాత వాటిని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లడం మంచిదని కేసీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది.