భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ తొలిరోజు వర్షార్పణమైంది. కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా… ఆసీస్ 28 పరుగులు చేసింది. పిచ్ , వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సారథి రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే
ఈ మ్యాచ్‌కు హాజరైన ఆసీస్ అభిమానులు.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను టార్గెట్ చేశారు. బౌండరీ లైన్ వద్ద సిరాజ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. అతన్ని తక్కువ చేసేలా కామెంట్స్ చేశారు. దీనిపై పలువురు మాజీ ఆటగాళ్ళు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పింక్ బాల్ టెస్ట్‌లో ట్రావిస్ హెడ్, సిరాజ్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించగా.. అతన్ని సిరాజ్ ఔట్ చేశాడు. సెంచరీ బ్యాటర్‌ను ఔట్ చేశాననే ఆనందంలో సిరాజ్ గట్టిగా సంబరాలు చేసుకోగా.. ట్రావిస్ హెడ్ నోటికి పనిచెప్పాడు. సిరాజ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ పెవిలియన్ కు వెళ్లాలని సైగలు చేశాడు.
సిరాజ్ బౌలింగ్‌ను మెచ్చుకుంటే అనుచితంగా ప్రవర్తించాడని మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ చెప్పగా..అతను అబద్దాలు చెప్పాడని, తనను ఎక్కడా మెచ్చుకోలేదంటూ సిరాజ్ కౌంటర్ ఇచ్చాడు.వీరిద్దరి మధ్య గ్రౌండ్ లో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ గా నిలిచింది. అటు ఐసీసీ కూడా స్పందించి సిరాజ్ పై చర్యలు తీసుకుంది. హైదరాబాదీ పేసర్ కు 20 శాతం జరిమానా విధించి..హెడ్ ను మందలించింది. అప్పటి నుంచి ఆసీస్ మీడియాతో పాటు అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ కు సిరాజ్ టార్గెట్ గా మారాడు. తాజాగా గబ్బాలోనూ ఆస్ట్రేలియా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సిరాజ్‌ను టార్గెట్ చేస్తూ పదే పదే గేలి చేశారు. నిజానికి రెండో టెస్ట్ తర్వాత సిరాజ్ , హెడ్ ఒకరినొకరు హగ్ చేసుకుని గొడవకు ముగింపు పలికినా… కంగారూ అభిమానులు మాత్రం దీనిని విడిచిపెట్టడం లేదు.
గబ్బాలో ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ప్రవర్తనపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ఇకనైనా ప్రవర్తన మార్చుకోవాలంటూ హితవు పలికాడు. సిక్సర్ కొట్టిన బ్యాటర్ ను ఔట్ చేసాక ఏ బౌలర్ అయినా కాస్త ఎక్కువగానే సెలబ్రేట్ చేసుకుంటాడని గుర్తు చేశాడు. యాషెస్ సిరీస్ లో ఆసీస్ పేసర్లు ఇలాంటివి ఎన్నోసార్లు చేసారన్నాడు. హెడ్, సిరాజ్ ఆ గొడవ మరిచిపోయినా స్థానిక అభిమానులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డాడు.