ఆదాయపన్ను… పాతదా… కొత్తదా… ? ఏ పన్ను పద్ధతిని ఎంచుకోవాలి…. ?
బడ్జెట్ వచ్చేసింది. నిర్మలమ్మ అంకెల గారడీ ముగిసింది. బడ్జెట్ కేటాయింపుల సంగతి పక్కన పెడితే వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆదాయపన్ను మినహాయింపుల్లో నిర్మలమ్మ మార్కు మతలబు కనిపించింది. ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అందులోనూ మెలిక పెట్టారు. పాత పన్ను విధానాన్ని యథాతథంగా ఉంచారు. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొత్త పన్ను విధానంలో మాత్రం శ్లాబులను మార్చారు. ఇక నుంచి డిఫాల్ట్ గా కొత్త పన్ను విధానం అమల్లోకి ఉంటుందని నిర్మలమ్మ చెప్పారు.
ఇంతకీ ఏ పన్ను విధానం మంచిది…? ఎంత ఆదాయం వచ్చేవారు ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలి…? ఎవరికెంత పన్ను పడుతుంది అన్నది ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఆదాయం, మినహాయింపులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పన్ను పడుతుంది. అయితే ఓసారి కింది టేబుల్ ను జాగ్రత్తగా పరిశీలించండి…
దాన్ని బట్టి మీరే పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చన్నది మీరే నిర్ణయించుకోండి.
ఆదాయం పాతపన్ను విధానం కొత్తపన్ను విధానం
( ఈ ఏడాది) ( వచ్చే ఏడాది నుంచి)
రూ. 5లక్షలు – – –
రూ. 6లక్షలు – రూ.23,400 –
రూ. 7.5లక్షలు రూ.23,400 రూ.39,000 –
రూ. 10లక్షలు రూ.75,400 రూ.78,000 రూ.54,600
రూ 12.50 లక్షలు రూ.1,32,600 రూ.1,30,000 రూ.93,600
రూ. 15 లక్షలు రూ.2,10,600 రూ.1,95,000 రూ.1,45,600
రూ. 25 లక్షలు రూ.5,22,600 రూ.5,07,000 రూ.4,52,400
( పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద లక్షా 50వేల రూపాయల గరిష్ట పన్నును చూపినట్లయితే…)
( పాత, కొత్తపన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ రూ.50వేలను కలుపుకుని)
2020లో కేంద్రం కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. అయితే పాతది ఎంచుకోవాలా లేక కొత్తదానికి మారాలా అన్నది పన్ను చెల్లింపుదారులకు వదిలేసింది. అయితే కొత్త విధానం అంతగా ఎవరినీ ఆకట్టుకోలేదు. పన్ను భారం కాస్త ఎక్కువగా ఉండటంతో వేతన జీవులు దాన్ని పట్టించుకోలేదు. దీంతో కొత్త పన్ను విధానంవైపు ట్యాక్స్ పేయర్స్ ను మళ్లించేందుకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో చర్యలు తీసుకున్నారు. పాత పన్ను విధానాన్ని అలాగే ఉంచి కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేశారు. కొత్త పన్ను విధానంలో మూడు లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. ఆరు లక్షల వరకు 5శాతం పన్ను విధిస్తారు. అయితే రిబేట్ తో కలిపి రూ.7లక్షల వరకూ ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను పడదు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ కింద మరో 50 వేల వరకు పన్నుండదు. అంటే ఏడున్నర లక్షల వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను ఉండదు. ఆదాయం 9లక్షలు దాటినా పన్ను పరిధి 10శాతంలోకే వస్తారు. ఈజీగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ విధానం అనుకూలం.
అయితే ఇక్కడే మెలిక ఉంది. పొదుపు పెద్దగా చేయని వారికి మాత్రమే ఈ విధానం అనుకూలం. గృహరుణం తీసుకోని వారికి కూడా ఇది ప్రయోజనకరమే. కానీ హోం లోన్ తీసుకున్న వారు మాత్రం పాత పద్ధతిపైనే మొగ్గు చూపొచ్చు. సెక్షన్ 80సీ కింద లక్షన్నర పరిమితిని పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు ఇంటిరుణం తీసుకుని వడ్డీ, అసలు చెల్లింపుపై పన్ను మినహాయింపు పొందుతున్న వారు మాత్రం కొంత మొత్తం వరకు పాత పన్ను విధానాన్నే ఎంచుకోవచ్చు. అయితే కేంద్రం తీరు చూస్తుంటే మాత్రం కొత్త పన్ను విధానంవైపు పన్ను చెల్లింపుదారులను మరల్చాలన్నదే ఆలోచనగా కనిపిస్తోంది. క్రమంగా అందరినీ ఆ విధానంవైపు మళ్లించి పాత పద్దతికి స్వస్తి చెప్పాలన్నది కేంద్రం ఆంతర్యంగా కనిపిస్తోంది. అంటే రానున్న రోజుల్లో ఆదాయం ఇంత పన్ను ఇంత అన్నదే లెక్కగా ఉంటుంది. సెక్షన్లు, మినహాయింపులు ఏమీ ఉండకపోవచ్చు… ఉన్నా పరిమితంగానే ఉంటాయనే చెప్పాలి.
(KK)