Pawan Kalyan: టీడీపీకి దూరంగా పవన్ కల్యాణ్‌.. 2024లో పార్టీల పొత్తు లేనట్లేనా?

వరుస సంఘటనలతో టీడీపీ విషయంలో నిర్ణయం తీసేసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ దూరం ఇలానే పెరిగితే.. సైకిల్‌కు రాంరాం.. సైకిల్‌తో రాంరాం అని పవన్ చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 28, 2023 / 03:44 PM IST

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. పవన్ కల్యాణ్ ఎటు ఉంటారన్న దాని మీదే.. ఫలితాలు ఆధారపడి ఉంటాయ్. టీడీపీ, జనసేన కలవకుండా.. కలిసి నిలవకుండా.. చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది వైసీపీ ! దమ్ముంటే ఒంటరిగా పోటీచేస్తారా అని జగన్ పదే పదే సవాల్ విసరవడం వెనక కారణం అదే ! వైసీపీ సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ, జనసేన మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఒక్క సంఘటన చాలు.. మనసు విరగడానికి అన్నట్లు.. పవన్ మనసు ఒక్క సీన్‌తో ముక్కలయిందా అనే చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్‌కు వెయ్యి కోట్లు అంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని అటు బీఆర్ఎస్, ఇటు జనసేన ఖండిస్తున్నా.. అది కాదు మ్యాటర్ ! ఎవరు రాశారన్నదే అసలు విషయం. పవన్‌కు బీఆర్ఎస్‌ వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చిందని.. ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. వేరే ఎవరు ఈ రాతలు రాసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఐతే టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా నుంచి ఇలాంటి పలుకులు రావడం.. పవన్‌ను బాగా హర్ట్ చేసిందట. అందుకే టీడీపీతో కావాలని దూరం జరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య చంద్రబాబుతో క్లోజ్‌గా కనిపించిన పవన్‌.. టీడీపీకి ఎదురైన ప్రతీ అడ్డగింతను ఖండించారు. అలాంటిది ఇప్పుడు మౌనం వహిస్తున్నారు.

గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌ మీద దాడి జరిగినా.. పట్టాభిని అరెస్ట్ చేసినా.. పవన్ నుంచి కనీసం రియాక్షన్ రాలేదు. యువగళం విషయంలోనూ సేనాని నుంచి కనీసం స్పందన రావడం లేదు. వెయ్యి కోట్ల రాతల వెనక ఉన్నది టీడీపీనే అని.. పవన్ కల్యాణ్ ఫిక్స్ అయ్యారని.. అందుకే కావాలని దూరంగా జరుగుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. నిజానికి టీడీపీ, జనసేన మధ్య పొత్తులు అనేది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే ! ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని పవన్ ప్రకటించారు. వరుస సంఘటనలతో టీడీపీ విషయంలో నిర్ణయం తీసేసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ దూరం ఇలానే పెరిగితే.. సైకిల్‌కు రాంరాం.. సైకిల్‌తో రాంరాం అని పవన్ చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.