టెస్ట్ ఫార్మాట్ లో రసవత్తర సమరానికి అంతా సిద్ధమైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి శుక్రవారం నుంచే తెరలేవబోతోంది. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ కోసం ఇరు జట్లు రెడీ అయ్యాయి. భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మంచి క్రేజ్ ఉంది. సిరీస్ ఆద్యంతం రసవత్తరంగా జరుగుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటుంది. ముఖ్యంగా సొంతగడ్డపై ఆసీస్ కు చెక్ పెట్టిన ఘనత మనదే… గత రెండు పర్యాయాలు కంగారూలకు చుక్కలు చూపించిన టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా గెలుచుకుంది. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుండగా.. ఆసీస్ మాత్రం ఈ సారి భారత్ జోరుకు బ్రేక్ వేయాలని పట్టుదలగా ఉంది. నిజానికి స్వదేశంలో కివీస్ చేతిలో వైట్ వాష్ ఓటమి తర్వాత టీమిండియా ఒత్తిడిలో పడింది. ఈ సారి కంగారూ గడ్డపై సిరీస్ గెలుపు అంత ఈజీ కాదనే చెప్పాలి.
దీనికి కారణాలను చూస్తే ఆసీస్ జట్టు ఈ సిరీస్ కోసం పలువురు సీనియర్ ఆటగాళ్ళకు గాయాలు కాకుండా రొటేషన్ లో రెస్ట్ ఇస్తూ రెడీ చేసింది. ముఖ్యంగా సొంతగడ్డపై తిరుగులేని పేస్ ఎటాక్ కంగారూల సొంతం. కెప్టెన్ కమ్మిన్స్, మిఛెస్ స్టార్క్, హ్యాజిల్ వుడ్, స్కాట్ బొలాండ్ లాంటి పేసర్లను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలే. ఎందుకంటే పెర్త్ లో బౌన్సీ పిచ్ ఎదురుచూస్తోంది. ఇక్కడ ఆసీస్ కు తిరుగులేని రికార్డుంది. ఇప్పటి వరకూ పెర్త్ లో ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ కంగారూలదే పైచేయిగా నిలిచింది. అటు భారత జట్టులో పుజారా, రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్టులు లేకపోవడం మైనస్ పాయింట్. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్ళలో కోహ్లీ, రాహుల్ పైనే బ్యాటింగ్ భారం పడనుంది. వీరిద్దరూ ఫామ్ లో లేకపోయినా… ఆసీస్ గడ్డపై కోహ్లీకి మంచి రికార్డుంది. ఈ సారి సిరీస్ లో ఖచ్చితంగా కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ లు ఆడతాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అటు జైశ్వాల్, పంత్ , పడిక్కల్, ధృవ్ జురెల్ వంటి యువ ఆటగాళ్ళపైనా అంచనాలున్నాయి. కానీ ఆసీస్ పేస్ ఎటాక్ ను తట్టుకుని వీరంతా ఎలా ఆడతారనేది చూడాలి.
ఒకవిధంగా యువ బ్యాటర్లకు ఈ సిరీస్ కఠినపరీక్షగానే చెప్పాలి. ఈ సిరీస్ లో వీరంతా సక్సెస్ అయితే మాత్రం ప్రపంచ క్రికెట్ లో భారత్ హవా మరింత పెరిగినట్టేనని చెప్పొచ్చు. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పెర్త్ టెస్టులో అరంగేట్రం చేసే ఛాన్సుంది. ఐపీఎల్.. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ లో ఆకట్టుకున్న నితీశ్ ను సెలక్టర్లు భారత్ ఎ జట్టుకు ఎంపిక చేసి ఆసీస్ టూర్ లో ఆడించారు. అదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఎంపిక చేశారు. కోచ్ గంభీర్ నితీశ్ రెడ్డిపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడంతో పాటు నాలుగో పేసర్ గా జట్టుకు ఉపయోగపడతాడని అంచనా వేస్తున్నాడు. ఇక మన పేస్ ఎటాక్ ను జస్ప్రీత్ బూమ్రా లీడ్ చేయనుండగా… సిరాజ్ , హర్షిత్ రాణా కీలకం కానున్నారు. హర్షిత్ రాణా అరంగేట్రం చేసే అవకాశాలుండగా… చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగితే ప్రసిద్ధకృష్ణకు చోటు దక్కొచ్చు. ఇక పెర్త్ పిచ్ పై బ్యాటింగ్ చేయడం అతిపెద్ద సవాల్. ఎప్పటిలానే బౌన్సీ వికెట్ తో కంగారూలు టీమిండియాకు సవాల్ విసురుతున్నారు. ఈ పిచ్ పై టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ కే మొగ్గుచూపొచ్చు. ఎందుకంటే నాలుగో ఇన్నింగ్స్ ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం… మొత్తం మీద పెర్త్ బౌన్సీ సవాల్ ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి.