ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ కు మిక్సిడ్ ప్రాక్టీస్ దక్కింది. ఆసీస్ పేస్ పిచ్ లపై బౌలర్లు క్లిక్ అయితే… బ్యాటర్లు మాత్రం ఫ్లాపయ్యారు. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించలేదు. టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న అభిమన్యు ఈశ్వరన్ నిరాశపరిచాడు. రెండో టెస్టులోనూ అతను తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక మిగిలిన బ్యాటర్లు కూడా ఆకట్టుకోలేకపోయారు. తొలి టెస్టులో సెంచరీ చేసిన సాయిసుదర్శన్ రెండో టెస్టులో మాత్రం చేతులెత్తేశాడు. అలాగే సీనియర్ బ్యాటర్ కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ , పడిక్కల్ కూడా నిరాశపరిచారు. అటు తొలి ఇన్నింగ్స్ లో 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ధృవ్ జురెల్ మాత్రం క్రీజులో ఉన్నాడు. అతనితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి కూడా నిలవడంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి భారత్ ఏ జట్టు 5 వికెట్లకు 73 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఏ ఓవరాల్ గా 11 పరుగుల లీడ్ లో మాత్రమే ఉంది.
మరోవైపు బౌలర్లు మాత్రం ఆసీస్ పిచ్ లపై సత్తా చాటుతున్నారు. ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ , ప్రసిధ్ధ కృష్ణ ఆకట్టుకున్నారు. భారత పేసర్లు సమిష్టిగా రాణించి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులకు ఆలౌట్ చేశారు. ప్రసిద్ధ కృష్ణ 4 , ముఖేశ్ కుమార్ 3 , ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 161 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తో ఐదు టెస్టుల సిరీస్ కు ముందు పలువురు కుర్రాళ్ళను ఈ సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఐదు టెస్టుల సుధీర్ఘ సిరీస్ కావడంతో రిజర్వ్ ప్లేయర్స్ గా కొందరికి అవకాశమిచ్చింది. నితీశ్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ , ధృవ్ జురెల్ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యారు. ఇక కెఎల్ రాహుల్ ను కూడా ముందే ప్రాక్టీస్ కోసం ఈ సిరీస్ లో ఆడిస్తున్నారు. కానీ రాహుల్ తన పేలవ ఫామ్ నుంచి ఇంకా బయటపడలేదు. రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లలోనూ రాహుల్ ఫ్లాపయ్యాడు.