టీ20 వరల్డ్ కప్ లో ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు న్యూయార్క్ వేదిక కానుంది. అయితే ఈ హోరాహొరీ పోరుకు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకున్న ఐసీసీ టికెట్ల ధరను భారీగా పెంచేసింది. డైమండ్ క్లబ్ విభాగంలోని ఒక్కో సీటును 20 వేల అమెరికా డాలర్లకు విక్రయిస్తున్నారు. అంటే భారత్ కరెన్సీలో సుమారు 16.65 లక్షలు. దీంతో లాభాన్ని అర్జించడం కోసం టికెట్ ధరలను అమాంతం పెంచిన ఐసీసీ తీరుపై చర్చనీయాంశంగా మారింది.
ఆటను విస్తరించాలని చెప్పే ఐసీసీ ఇప్పుడు లాభాల కోసం ప్రయత్నిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఐసీసీపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తీవ్ర విమర్శల చేశారు. టీ20 వరల్డ్ కప్ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు డైమండ్ క్లబ్‌లోని ఒక్కో సీటు టికెట్‌ను ఐసీసీ 20 వేల డాలర్లకు విక్రయిస్తోందని తెలిసి షాకయనట్టు చెప్పాడు. అమెరికాలో ఈ ప్రపంచకప్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఆటను విస్తరించడం, అభిమానులను సంపాదించుకోవడమనీ, టికెట్ల విక్రయాలపై లాభం పొందడానికి కాదని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల ధరలు సుమారు 25వేల రూపాయల నుంచి 8.32 లక్షలు పలుకుతుండగా…బ్లాక్ మార్కెట్ లో మూడు,నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.