అడిలైడ్ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే
నితీశ్ కుమార్ కాస్త పోరాడటంతో భారత్ కు ఇన్నింగ్స్ ఓటమి తప్పింది. మొత్తానికి రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 175 పరుగులు చేయగలిగింది. దీంతో కేవలం 19 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టు వికెట్ నష్టపోకుండానే విజయం సాధించింది. మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.
ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్‌లో భారత్ తమ అగ్రస్థానాన్ని కోల్పోయింది. భారత్‌పై గెలిచిన ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. 60.71 విన్నింగ్ పర్సంటేజీతో ఆసీస్ అగ్రస్థానంలో ఉంటే.. 59.26 పర్సంటేజీతో సౌతాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. పింక్ బాల్ టెస్ట్‌లో ఓడిన భారత్.. 57.29 పర్సంటేజీతో మూడో స్థానానికి పరిమితమైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే.. ఆసీస్‌తో జరగబోయే చివరి మూడు టెస్ట్‌లను గెలవాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతోంది. చివరి మూడు టెస్ట్‌ల్లో గెలవకపోతే.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ 2025 సైకిల్‌లో భారత్‌కు ఇదే చివరి సిరీస్ కాగా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇంకా సిరీస్‌లు ఉన్నాయి. ఆ సిరీస్ ఫలితాలు భారత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేయనున్నాయి.