Weather Forecast: అటు ఎండలు.. ఇటు వానలు.. రాబోయే వారం రోజుల వాతావరణ అంచనా ఇదే!

రాబోయే వారం రోజుల్లో ఇండియాలోని అనేక ప్రాంతాల్లో ఎండ, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. సాధారణంకన్నా 3-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావొచ్చని ఐఎండీ తెలిపింది.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 06:13 PM IST

Weather Forecast: దేశంలో ఎండాకాలం ప్రభావం మొదలైంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఎండ వేడిమితో అల్లాడుతున్నాయి. వడగాల్పులతో అతలాకుతలమవుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో ఇండియాలోని అనేక ప్రాంతాల్లో ఎండ, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. సాధారణంకన్నా 3-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావొచ్చని ఐఎండీ తెలిపింది. సగటున 39-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు, మధ్య భారత దేశ ప్రాంతాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఐఎండీ అంచనా ప్రకారం రాబోయే వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్‌తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలు, ఒడిశా, కోస్తాంధ్ర, మహారాష్ట్రల్లో 3-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండొచ్చు. అసోం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడుల్లో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ రాష్ట్రాల్లో 2-3 డిగ్రీల ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మిగతా దేశంలో ఇక్కడికంటే 1-3 డిగ్రీల ఎండ తక్కువగా ఉంటుంది.
వాయువ్య భారత దేశంలో
రాబోయే రెండు రోజుల్లో వాయువ్య భారత దేశంలో 1-2 డిగ్రీల ఎండ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాతి రోజుల్లో 2-4 డిగ్రీల ఎండ తగ్గే అవకాశం ఉంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఏప్రిల్ 19 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. ఏప్రిల్ 17-19 వరకు పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్‌లలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ హిమాలయాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
సెంట్రల్ ఇండియా
రాబోయే నాలుగు రోజుల్లో సెంట్రల్ ఇండియాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో మాత్రం రాబోయే ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. బలమైన గాలులు కూడా వీయొచ్చు. ఈ నెల 18, 19 తేదీల్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉంది.


వెస్ట్ ఇండియా
పశ్చిమ భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడాల్లో వర్షాలు పడతాయి. మంగళ, బుధ వారాల్లో రాజస్థాన్‌పై కూడా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉంది.
దక్షిణ భారత దేశం
దక్షిణాదికి సంబంధించి రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు కూడా ఉండొచ్చు. కర్ణాటక తీర ప్రాంతం, ఆంధ్రా తీర ప్రాంతాల్లో శనివారం ఈ రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో 17వ తేదీ వరకు వర్షాల ప్రభావం ఉండొచ్చు. ఉత్తర కర్ణాటకలో 18, 19 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ రాష్ట్రాలకు వడగాలుల ముప్పు
రాబోయే ఐదు రోజుల్లో వడగాలుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, బిహార్, ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాలు, ఒడిశాలో వడగాలులు వీస్తాయి. బిహార్‌లో ఏప్రిల్ 24 వరకు వడగాలులు వీస్తాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది ఐంఎండీ. సాధారణంగా తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, ఇతర ప్రాంతాల్లో 40 డిగ్రీలు, పర్వత ప్రాంతాల్లో 30 డిగ్రీలు దాటితే వడగాలుల ప్రభావం ఉంటుంది.