సొంతగడ్డపై మరో టెస్ట్ సిరీస్ కు టీమిండియా రెడీ అయింది. న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం నుంచే బెంగళూరు వేదికగా ఆరంభం కానుంది. ఇటీవలే బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరోసారి సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై టీమిండియా ఎప్పుడూ బలమైన జట్టే. ఇటీవల బంగ్లాదేశ్ తో ఆడిన జట్టునే సెలక్టర్లు కివీస్ తో సిరీస్ కూ ఎంపిక చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే మనకు మరో 4 విజయాలు కావాల్సి ఉండగా.. కివీస్ తో సొంతగడ్డపై మూడు టెస్టుల సిరీస్ ఆడనుండడం పెద్ద అడ్వాంటేజ్. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్ బెంగళూరు హోంగ్రౌండ్ గా ఆడుతున్న విరాట్ ఫామ్ లోకి వచ్చేందుకు కూడా ఇదే మంచి ఛాన్స్.. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇటీవల బంగ్లాదేశ్ తో సిరీస్ పెద్దగా రాణించలేదు. దీంతో వీరిద్దరిపైనా అంచనాలున్నాయి.
ఇక ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు. టెస్ట్ క్రికెట్ అరంగేట్రం నుంచి పరుగుల వరద పారిస్తున్న జైశ్వాల్ ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సీజన్ లో 1217 రన్స్ తో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే గిల్, రిషబ్ పంత్ , కెఎల్ రాహుల్ కూడా సత్తా చాటితే కివీస్ బౌలర్లకు చుక్కలే. మరోవైపు బౌలింగ్ లో అశ్విన్,జడేజా ఆధిపత్యం కొనసాగుతూనే ఉండడం, పేసర్లు కూడా రాణిస్తుండడంతో కాంబినేషన్ పరంగా ఎటువంటి టెన్షన్ లేదు. మరోవైపు న్యూజిలాండ్ ఎంతవరకూ పోటీ ఇస్తుందనేది చూడాలి. ఇటీవల లంక టూర్ లో చిత్తుగా ఓడిన కివీస్ కు విలియమ్సన్ లాంటి ప్లేయర్ అందుబాటులో లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.
కాగా రికార్డుల పరంగా చూస్తే ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా భారత్ 22, న్యూజిలాండ్ 13 గెలిచాయి. 27 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇక బెంగళూరు టెస్టుకు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తొలి రోజు 70 శాతం , రెండో రోజు 90 శాతం వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే వర్షంతో ప్రాక్టీస్ సెషన్స్ రద్దయ్యాయి. అటు తుది జట్టు కాంబినేషన్ పై ఇరు జట్లు ఇంకా నిర్ణయానికి రాకపోవడానికి వర్షమే కారణం. అయితే చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థ ఉండడంతో వర్షం కాస్త తగ్గినా మైదానాన్ని రెడీ చేసేందుకు వీలుంది.