బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటర్లు ఆసీస్ పేస్ కు తడబడ్డారు. భారత్, ఆసీస్ మ్యాచ్ అంటేనే వివాదాలు లేకుండా ఉండవు.. ఒక్కోసారి ప్లేయర్లు ఒకరిపై ఒకరు నోరు జారితే… మరోసారి అంపైర్లు వివాదాస్పద నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఎప్పటిలానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ సారి కూడా వివాదంతోనే మొదలైంది. పెర్త్ టెస్ట్ తొలిరోజే థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలు స్పృహలో ఉండి ఇచ్చాడో… ఆసీస్ వైపు స్టాండ్ తీసుకున్నాడో తెలీదు కానీ థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ రాహుల్ నాటౌట్ అయితే ఔట్ గా ప్రకటించాడు.స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ రాహుల్ ఔట్‌గా థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మిచెల్ స్టార్క్ వేసిన బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ డిఫెన్స్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాటుకు తాకుతూ వెళ్లిందని ఆస్ట్రేలియా ప్లేయర్లు అపీలు చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇవ్వలేదు. దీంతో ఆసీస్ రివ్యూకు వెళ్ళగా… థర్డ్ అంపైర్ స్నికో మీటర్ ఆధారంగా ఔట్‌ను పరిశీలించాడు. అయితే బ్యాటు సమీపం నుంచి బంతి వెళ్తున్న సమయంలోనే రాహుల్ బ్యాట్ తన ప్యాడ్లకు తాకింది. దీంతో స్నికోలో స్పైక్ చూపించింది. బ్యాటుకు బంతి తాకినందుకు అలా వచ్చిందా? లేదా ప్యాడ్లకు బ్యాటు తాకినందుకు స్నికో మీటర్ రీడింగ్ చూపించిందా? అనే విషయం గందరగోళంగా మారింది. కానీ థర్డ్ అంపైర్ ఫ్రంట్ వ్యూతో పరిశీలించి..బంతి దిశలో డిఫ్లెక్షన్ వచ్చిందని భావించి ఔట్‌గా ఇచ్చాడు. ఈ ఆధారంగా థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై కేఎల్ రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిరాశగా మైదానం వైపు కదిలాడు. కాగా, కుదురుకున్న రాహుల్ ఔటవ్వడం టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బగానే చెప్పాలి.
ఎందుకంటే రాహుల్ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పరుగులు చేశాడు. 74 బంతుల్లో 26 పరుగులు చేసిన రాహుల్ ఖచ్చితంగా క్రీజులో మరింతగా నిలదొక్కుకునేవాడు. ఒకవైపు 4 వికెట్లు చేజారినా రాహుల్ పట్టుదలగా ఆడాడు. అయితే థర్డ్ అంపైర్ తప్పిదానికి బలవ్వాల్సి వచ్చింది. మరోవైపు కెఎల్ రాహుల్ వివాదాస్పద పెద్ద దుమారాన్నే రేపింది. మాజీ క్రికెటర్లు సైతం బ్యాట్ ప్యాడ్ కు తగలడంతో స్పైక్ వచ్చిందని అంచనా వేశారు. ఇంత టెక్నాలజీ ఉన్నప్పటకీ థర్డ్ అంపైర్ నాటౌట్ ను ఔట్ గా ఎలా ప్రకటించాడంటూ సంజయ్ మంజ్రేకర్ లాంటి మాజీ ప్లేయర్స్ మండిపడ్డారు. అటు సోషల్ మీడియాలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ థర్డ్ అంపైర్ ను తిట్టిపోశారు. కళ్ళు లేనోడిని థర్డ్ అంపైర్ చేశారా అంటూ మండిపడుతున్నారు.