Kadhai Milk: కడాయ్ పనీర్, కడాయ్ చికెన్ గురించి చాలా మందికి తెలుసు. ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం కడాయ్ మిల్క్ గురించి. అదేంటీ.. కడాయిలో పాలతో రెసిపీ చేస్తారా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే కడాయ్ మిల్క్ ఇప్పుడు ట్రెండీ ఐటమ్. అలాగని ఇదేమీ పనీర్, చికెన్ లాంటి మెయిన్ కోర్స్ ఐటమ్ కాదు. హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఇండియాలో తయారవుతున్న అతిపెద్ద కడాయ్ మిల్క్ సెంటర్ ఇదే అని అమర్ సిరోహి అనే ఫుడ్ బ్లాగర్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‍లో షేర్ చేశాడు.
పాలు అన్నా, పాలతో తయారయ్యే రెసిపీలు అన్నా మన వాళ్లకు చాలా ఇష్టం. పెరుగు, వెన్న, నెయ్యి, జున్నుతోపాటు బాదం మిల్క్, రోజ్ మిల్క్, మిల్క్ షేక్ వంటి ఎన్నో డ్రింక్స్ పాలతో తయారవుతాయి. ఈ కోవలో కొత్తగా వచ్చిందే కడాయ్ మిల్క్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక చిన్న స్టాల్‌లో దీన్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ రోజూ భారీ ఎత్తున కడాయ్ మిల్క్ అమ్ముడవుతుంది. దీని తయారీ విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ వివరాలన్నింటితో కూడిన వీడియోను అమర్ షేర్ చేశాడు. ఇప్పుడు దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే కొన్ని వంటలపై నెటిజన్లు చిరాకు పడుతుంటే కడాయ్ మిల్క్‌పై మాత్రం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
ఎలా తయారు చేస్తారంటే..
ఇక్కడ కడాయ్ మిల్క్‌ను నిర్వాహకులు భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. దీని తయారీకి రోజూ 151 లీటర్ల గేదె పాలు వాడుతారు. ఇందుకోసం ప్రత్యేకంగా గేదె పాలను సేకరిస్తారు. ఆ పాలలో ఎలాంటి కల్తీగానీ, అనవసర పదార్థాలుగానీ లేకుండా వడపోస్తారు. తర్వాత కోవా తయారీ మెషీన్‌లో పాలు పోసి కొద్దిసేపు తిప్పుతారు. పాలకు మంచి రంగు వచ్చేందుకు కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ కలుపుతారు. తర్వాత కడాయ్ మిల్క్ తయారీ కోసం పెద్ద కడాయ్ వాడుతారు. అందులో ఈ పాలు పోసి మరిగిస్తారు. దాదాపు అరగంట సేపు కడాయిలో పాలను మరిగిస్తారు. పాలు పొంగిపోకుండా కలుపుతూనే ఉంటారు. తర్వాత కుంకుమ పువ్వు, ఆ తర్వాత ఐదు కేజీల చక్కెర కూడా కలుపుతారు.
ఇలా పాలను మరిగిస్తున్నప్పుడు పైన, అంచుల వెంట క్రీమ్ ఏర్పడుతుంది. అప్పుడు గ్లాసులో పాలను, క్రీమ్‌ను కలిపి అందిస్తారు. ఇలా ఇచ్చేముందు అందులో రబ్రీని కూడా కలుపుతారు. చివరగా బాదం, పిస్తా ముక్కలు కలపడం వల్ల కడాయ్ మిల్క్ టేస్ట్ మరింత పెరుగుతుంది. దీంతో కడాయ్ మిల్క్ టేస్టీగా, క్రీమీగా ఉంటుంది. ఒక గ్లాస్ కడాయ్ మిల్క్ ధర రూ.65. ధర కాస్త ఎక్కువే అనిపించినప్పటికీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంటున్నారు వినియోగదారులు.