మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ డూ ఆర్ డై పోరుకు సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే హర్మన్ ప్రీత్ సారథ్యంలోని మన జట్టు సెమీస్ చేరినట్టే.. అయితే ఓడిపోతే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. నిజానికి ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ లో కివీస్ పై ఓటమి భారత్ కొంపముంచింది. ఖచ్చతంగా గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 52 రన్స్ తేడాతో ఓడిపోవడంతో రన్ రేట్ దారుణంగా పడిపోయింది. తర్వాత పుంజుకున్న వుమెన్ ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైనా, మరో మ్యాచ్ లో శ్రీలంకపైనా గెలిచింది.
పాక్ పై గెలిచినా స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి చివరి వరకూ ఆడిన భారత్ తర్వాతి మ్యాచ్ లో మాత్రం శ్రీలంకను 82 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా రన్ రేట్ మెరుగుపరుచుకుని సెమీస్ రేసులో నిలిచింది. ఇదే జోరులో ఆస్ట్రేలియాను ఓడించేందుకు రెడీ అయింది. అయితే ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. కంగారూలను ఓడించాలంటే భారత్ మహిళల జట్టు అంచనాలకు మించి రాణించాల్సిందే. దీనికి తోడు గత రికార్డుల్లో ఆసీస్ దే పైచేయిగా ఉంది. మెగా టోర్నీలో ఆసీస్ తో తలపడిన ఐదు మ్యాచ్ లల్లోనూ భారత్ ఓడిపోయింది. అయితే యుఏఈ పిచ్ లు భారత స్పిన్నర్లకు కలిసొచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం గ్రూప్-ఏలో టీమిండియా రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన భారత్ ఖాతాలో 4 పాయింట్స్ ఉండగా.. మూడింటికి మూడు గెలిచిన ఆసీస్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు శ్రీలంక, పాకిస్థాన్‌తో ఆడాల్సిన న్యూజిలాండ్ రెండూ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్స్ చేరుతాయి. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరుతాయి. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడితే మాత్రం… న్యూజిలాండ్ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ సెమీస్ చేరాలంటే కివీస్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వాలి. భారత్ రన్ రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. అప్పుడే సెమీస్ బెర్త్ దక్కుతుంది.