దేశవ్యాప్తంగా యువక్రికెటర్ల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఓ వేదిక ఉండాలన్న ఉద్దేశంలో బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది. ఉద్దేశం మంచిదే అయినా ఐపీఎల్ ఇప్పుడు భారత ఆటగాళ్ళ కొంపముంచుతోంది. ఈ లీగ్ లో టీ ట్వంటీ ఫార్మాట్ కు బాగా అలవాటుపడిపోయిన మన బ్యాటర్లు అసలు ఆట మరిచిపోయారు. టెక్నిక్ సంగతి పక్కన పెట్టి దూకుడే లక్ష్యంగా , భారీ షాట్లే ఆడుతూ పొట్టి క్రికెట్ కు బాగా అలవాటుపడిపోయారు. ఫలితం రెడ్ బాల్ క్రికెట్ లో చేతులెత్తేయడం… నిజానికి ఏ ఆటగాడి సత్తా అయినా టెస్ట్ ఫార్మాట్ తోనే వెలుగులోకి వస్తుంది. టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ కు బాస్ అని ఎందుకంటారో దీనిలో నిలకడగా రాణించే ఆటగాడికే తెలుస్తుంది. టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే ఎంతో ఓపిక కావాలి… డిఫెన్స్ ఉండాలి… టెక్నిక్ తెలియాలి… ప్రత్యర్థి బౌలర్లు కవ్వించినా,బౌన్సర్లతో భయపెట్టినా సహనంతో క్రీజులో నిలవాలి. కాసేపు ఓపిగ్గా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిచాలి.
కానీ ఐపీఎల్ పుణ్యామని టెక్నిక్ సంగతి అటుంచితే అసలు క్రీజులో నిలబడాలన్న ఆలోచన పూర్తిగా పోయినట్టు కనిపిస్తోంది. టెస్టుల్లో ఓపిగ్గా కాసేపు ఆడాలన్న విషయం కూడా మరిచిపోయినట్టు అర్థమవుతోంది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో సీనియర్ బ్యాటర్ల ఆటతీరు చూస్తే ఇదంతా క్లియర్ గా తెలుస్తుంది. కొత్తబంతితో పేసర్లు పట్టు సాధించడం టెస్టుల్లో సహజమే… అలాంటి పరిస్థితుల్లోనే సహనంతో ఆడుతూ లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ ను వదిలేయాలి. కానీ తొలి ఇన్నింగ్స్ లో దీనికి భిన్నంగా అలాంటి బంతులను ఆడాలా వద్దా అన్న మీమాంసలో వాటిని వెంటాడి వికెట్లు సమర్పించుకున్నారు. ఐపీఎల్ లో ప్రతీ బాల్ ను బౌండరీనో, సిక్సర్ గానో కొట్టేసే అలవాటు మరిచిపోని మన బ్యాటర్లు టెస్టుల్లోనూ ఒక్కోసారి అదే ఫాలో అయ్యి మూల్యం చెల్లించుకుంటున్నారు. దానికి ఫలితమే కివీస్ తో తొలి టెస్టులో 46 పరుగులకు ఆలౌటవడం….
రెండో ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్ లు ఆడకుంటే ఇన్నింగ్స్ ఓటమి ఎదురయ్యేది. టాపార్డర్ లో రోహిత్ , కోహ్లీ కూడా పర్వాలేదనిపించినా ఇంకా టీ ట్వంటీ ఫార్మాట్ ప్రభావం వారి బ్యాటింగ్ పై కనిపిస్తోంది. అటు కెఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా కూడా టెస్టుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలన్నది మరిచిపోయారు. పంత్, సర్ఫరాజ్ ఇద్దరూ మంచి పార్టనర్ షిప్ తో ఇన్నింగ్స్ నిలబెడితే… రాహుల్ , జడేజా మాత్రం చెత్త షాట్లతో వికెట్లు ఇచ్చుకున్నారు. కాసేపు కూడా ఓపిగ్గా క్రీజులో నిలవకుండా వీరిద్దరి ఆటతీరు చూస్తే ఐపీఎల్ గుర్తుకొచ్చింది. ఒకవేళ రాహుల్, జడేజా టెస్ట్ ఫార్మాట్ కు తగ్గట్టు ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఎవరైనా చెబుతారు. హడావుడిగా క్రీజులోకి వచ్చే అంతే వేగంగా పెవిలియన్ కు వెళ్ళిపోయే అలవాటు టెస్టుల్లో ఏ మాత్రం పనికిరాదు. అందుకే దేశవాళీ క్రికెట్ లో రంజీ మ్యాచ్ లు రెగ్యులర్ ఆడే ప్లేయర్స్ మాత్రమే టెస్టుల్లో సుధీర్ఘకాలం కొనసాగుతారు. ఇకనైనా మన బ్యాటర్లు ఐపీఎల్ మాయ నుంచి బయటపడి సంప్రదాయ ఫార్మాట్ కు తగ్గటు ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.