ఐపీఎల్ మెగావేలం వీరికి రిటెన్షన్ లేనట్టే

ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ లో వేలం జరగనుండగా... ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రతీ ఫ్రాంచైజీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పేలా లేదు.

  • Written By:
  • Publish Date - September 24, 2024 / 06:01 PM IST

ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ లో వేలం జరగనుండగా… ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రతీ ఫ్రాంచైజీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పేలా లేదు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల అంచనా ప్రకారం కొన్ని షాకింగ్ నిర్ణయాలు ఖాయమైనట్టే కనిపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ ఫ్రాంచైజీని వీడడం ఖాయమైంది. పాండ్యాను కెప్టెన్ గా చేసినప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న హిట్ మ్యాన్ ను ముంబై కూడా రిటైన్ చేసుకునే అవకాశాలు లేవు. అయితే రోహిత్ ను ట్రేడింగ్ ద్వారా వేరే ప్లేయర్ ను తీసుకుంటుందా.. లేక మెగావేలంలోకి వదిలేస్తుందా అనేది చూడాలి.

అలాగే లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెెఎల్ రాహుల్ కూడా వేలంలోకి రానున్నాడు. ఫ్రాంచైజీ ఓనర్ల తీరుపై అసంతృప్తిగా ఉన్న రాహుల్ వచ్చే సీజన్ నుంచి కొత్త జట్టుకు ఆడడం ఖాయమైంది. లక్నో కూడా అతన్ని రిటైన్ చేసుకునేందుకు సిద్ధంగా లేదని వార్తలు వస్తున్నాయి. ఇక కెప్టెన్ డుప్లెసిస్‌ ను రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు వదిలేయనుంది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసుతో ఉన్న డుప్లెసిస్‌ను తప్పించి మరొక యువ క్రికెటర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఆర్సీబీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ను కూడా బెంగళూరు రిలీజ్ చేయబోతోంది. గత సీజన్ లో అట్టర్ ఫ్లాపయిన మాక్సీని కొనసాగించేందుకు ఆర్సీబీ ఏమాత్రం సిద్ధంగా లేదు. దీంతో అతను కూడా వేలంలోకి రానున్నాడు. అలాగే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ బై చెప్పనుంది. గత సీజన్ లో వార్నర్ పెద్దగా రాణించలేదు. అయితే వార్నర్ ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తే తీసుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య పోటీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.