గత రాత్రి ఇరాన్ ప్రయోగించిన 180-బేసి బాలిస్టిక్ క్షిపణులలో ఒకటి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మొసాద్… టెల్ అవీవ్ ప్రధాన కార్యాలయం సమీపంలో పడటం ఆందోళన కలిగించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో టెహ్రాన్ చేసిన క్షిపణి దాడిలో… ఓ క్షిపణి మొసాద్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో పడినట్టుగా కనపడుతోంది. అంతర్జాతీయ మీడియా ఈ వీడియోని జియో లోకేట్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది మొస్సాద్ ప్రధాన కార్యాలయానికి 3 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న ఓ ఎత్తైన అపార్ట్మెంట్ నుంచి షూట్ చేసారు.
క్షిపణి దాడితో దుమ్ము రేగడంతో పాటు పక్కనే పార్క్ చేసిన పలు వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. ఈ క్షిపణి ఓ సినిమా హాల్ దగ్గరలో పడినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్ క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఇజ్రాయెల్ కీలక నగరాల్లో సైరన్ లు మోగించి ప్రజలను అలెర్ట్ చేసారు. ఈ దాడి తర్వాత దాదాపు కోటి మందిని బాంబు షెల్టర్ లకు తరలించారు అధికారులు. ఈ దాడుల్లో ఇప్పుడు ఐరన్ డోమ్ కీలక పాత్ర పోషించింది. అధునాతన రక్షణ వ్యవస్థగా పేరొందిన ఐరన్ డోమ్ చాలా క్షిపణులను అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి.
కానీ కొన్ని షీల్డ్ ని చీల్చుకుని వచ్చాయని దీని ద్వారా భారీ నష్టమే జరిగిందని ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హతం కావడంతో ఇరాన్ ఈ దాడులకు దిగింది. ఇక దీనిపై స్పందించిన ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమన్ నేతన్యాహూ ఇరాన్ పెద్ద తప్పు చేసిందని అన్నారు. దానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. ఉద్రిక్తతలను తగ్గించకుంటే మళ్లీ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని భారత్‌లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి హెచ్చరించారు. ఇదిలా ఉంచితే ఇజ్రాయిల్ కు అమెరికా మద్దతు ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్‌కు అండగా ఉంటుందని, ప్రతీకార చర్యలకు మద్దతిస్తామని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేసారు.