రైలులో ప్రయాణం చేసే వారు రైల్వేలోని ప్రైవేట్ సిబ్బంది అమ్మే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. కరోనా తరువాత పరిస్థితులు మారాయి. అందులో నాణ్యత ఏమాత్రం ఉంటుందో తెలియదు. ఈ ఉద్దేశ్యంతో ఆన్లైన్ లో ఐఆర్సీటీసీ యాప్ ద్వారా ఫుడ్ ఆర్ఢర్ పెడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలోని క్యాటరింగ్ సంస్థ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్సీటీసీ కి చెందిన ఈ- క్యాటరింగ్ సేవల కింద ప్రయాణీకులకు మరిన్ని రెస్టారెంట్లు, ఫుడ్ ఐటెమ్స్ అందించేందుకు సిద్దమైంది. దీని కోసం దిగ్గజ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఐదు స్టేషన్లలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రయోగం సత్ఫలితాలను ఇస్తే దేశ వ్యాప్తంగా ప్రముఖ స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా రచిస్తోంది.
ఇప్పటి వరకూ కేవలం వేళ్లలో లెక్కపెట్టగలిగే రెస్టారెంట్లు మాత్రమే ఐఆర్సీటీసీ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. పైగా ఈ హోటల్స్ కి సంబంధించిన సిబ్బంది మాత్రమే మన కోచ్ వద్దకు వచ్చి ఆర్డర్ డెలివరీ చేసి వెళ్లే వారు. తాజాగా జొమాటోతో భాగస్వామ్యం కావడం వల్ల ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనిని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద న్యూఢిల్లీ, ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లఖ్నో, వారణాసి స్టేషన్లలో అమలుచేస్తుంది. కేవలం ప్రయాణీకులకు ఎక్కువ ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యంతోనే దీనిని తీసుకువచ్చారు. అటు సెలవులు, ఇటు పండుగల సీజన్ కావడంతో అమ్మవారి దీక్షలు చేసే వారికి, కుటుంబంతో టూర్ వెళ్లేవారికి చాలా ప్రత్యేకమైన మంచి భోజనాన్ని ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఐఆర్సీటీసీ కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు కూడా అందిస్తోంది.
T.V.SRIKAR