ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో ఉన్న ఆయన.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు తెలంగాణలో బీజేపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ లో విస్తారమైన నెట్ వర్క్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని కమల దళం బలోపేతానికి ఆయన వ్యూహ రచన చేస్తున్నారని తెలుస్తోంది. నల్లారి రాజకీయ చతురతను చాటేలా త్వరలోనే బీజేపీలోకి కాంగ్రెస్ నుంచి భారీగా చేరికలు ఉంటాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే వారంలోగా 40 మందికి తగ్గకుండా సీనియర్లు ఇతర పార్టీల నుంచి బీజేపీ గూటికి చేరతారని వినికిడి. ఇలా బీజేపీలో చేరబోయే లీడర్లలో ఎక్కువమంది కాంగ్రెస్ వారేనని సమాచారం.
పాత పరిచయాలతో చేరికలపై ప్లానింగ్
తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. అక్కడ పార్టీ క్యాడర్ కూడా అంతంతే. వచ్చే ఎన్నికల్లోగా అక్కడ పెనుమార్పును సాధించడం అసాధ్యం. పైగా ఏపీలో అధికార పీఠంపై ఉన్న వైఎస్సార్ సీపీ పార్టీ బీజేపీకి చాలా సన్నిహితంగా మెలుగుతోంది. ఈ తరుణంలో తెలంగాణపైనే బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. స్వయంగా ప్రధాని మోడీ దృష్టిసారించిన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ధీటుగా అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే
ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి.. తెలంగాణలో చేరికలను ప్రోత్సహించే బాధ్యతను అమిత్ షా అప్పగించారని తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి చేరికపై క్లారిటీ వచ్చాకే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్ర బీజేపీని బలోపేతం చేసే విషయంలో తెలంగాణ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కలిసికట్టుగా పనిచేయనున్నారని అంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో బీజేపీ స్ట్రాంగ్ గానే ఉంది. కానీ దక్షిణ తెలంగాణలో కమల దళం క్యాడర్ అంతంతే. దీంతో ఆ ప్రాంతంలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలపై కిరణ్ కుమార్ రెడ్డి దృష్టిపెట్టారని సమాచారం. తన పాత పరిచయాలతో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నుంచి సీనియర్లు, పాపులర్ లీడర్లను ఆకర్షించడానికి ఆయన ప్రయత్నాలను చేస్తున్నారట. ఎన్నికలు సమీపించే నాటికి తెలంగాణ టీడీపీ, బీజేపీ మధ్య కూడా ఒక అవగాహన కుదురుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. టీడీపీకి క్షేత్ర స్థాయిలో ఉన్న పేరు, క్యాడర్ లు బీజేపీకి అదనపు బలంగా మారే ఛాన్స్ ఉంది.
బీఆర్ఎస్ కు రాజకీయ అస్త్రం..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత కొద్దికాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు. రాష్ట్ర ఆవిర్భావాన్ని వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి సేవలను తెలంగాణ బీజేపీ వాడుకుంటుండటంపై కేసీఆర్ అండ్ టీమ్ నిప్పులు చెరుగుతోంది. ఆయన్ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తోంది. అయితే నల్లారి వారి చేరికల గైడెన్స్ తెలంగాణ బీజేపీని ఏ దిశగా నడిపిస్తుందో వేచి చూడాలి.