చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయం భగ్గుమంటోంది. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే.. మాకు టైమ్ వస్తుంది మేమేంటో చూపిస్తామని టీడీపీ నేతలు, కార్యకర్తలు సవాల్ విసురుతున్నారు. దీంతో నివురు గప్పిన నిప్పులా ఉంది పరిస్థితి ఏపీలో ! చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు.. ఆయనను ఊళ్లల్లో తిప్పిన విధానం తెలుగు తమ్ముళ్లకు కోపం తెప్పిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇదే కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయ్.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ పాత్ర కూడా ఉందని.. త్వరలోనే ఆయనను కూడా విచారిస్తామని సీఐడీ చీఫ్ అన్నారు. లోకేష్ పాత్రను కూడా బయటపెడతామని.. ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా లోకేష్ పాత్రపైన విచారణ చేస్తామని వివరించారు. ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ మళ్లింపులో లోకేష్ పాత్ర ఉందని తేలిందని క్లియర్‌కట్‌గా చెప్పేశారు. చంద్రబాబుతో అధికారులు మాట్లాడారని.. హెలికాప్టర్‌లో తీసుకొస్తామంటే చంద్రబాబు వద్దన్నారని అన్నారు. ఇక అటు చంద్రబాబు అరెస్ట్‌తో లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. చంద్రబాబును చూసేందుకు లోకేశ్ వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో రోడ్డు మీద బైఠాయించిన ఆయన.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అటు లోకేష్ పాదయాత్ర కోనసీమ జిల్లాలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సీఐడీ చీఫ్ వ్యాఖ్యలతో త్వరలోనే లోకేష్‌ను కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేస్తారేమోననే టెన్షన్ టీడీపీ వర్గాల్లో నెలకొంది. ఒకవేళ లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తే యువగళం పాదయాత్ర నిలిచిపోయే అవకాశముంది. దీంతో చంద్రబాబుతోనే సరిపెడతారా.. లేదా రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయా అనేది టీడీపీ వర్గాలను టెన్షన్ పెడుతోంది.