ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత క్రికెట్ జట్టును సిద్ధం చేసేలా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అడుగులు వేస్తున్నాడు. బాధ్యతలు తీసుకున్న తొలి సిరీస్ లోనే జట్టు ఎంపికలో తన ముద్ర ఉండేలా చూసుకున్నాడు. లంక పర్యటన కోసం ఎంపికైన జట్టుతో అతని ఫ్యూచర్ ప్లాన్స్ పై క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. యువ, సీనియర్ ఆటగాళ్ళ కూర్పుతో జట్టును రెడీ చేస్తున్నాడు. దీనిలో భాగంగా కొందరికి ఉద్వాసన పలకక తప్పడం లేదు. ప్రస్తుతం గంభీర్ ప్లాన్స్ చూస్తుంటే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. శ్రీలంక టూర్ కు జట్టు ఎంపికలో అసలు జడేజా పేరును పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. ఈ కారణంగానే అతనికి చోటు దక్కలేదని తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆడే జట్టుపై ఇప్పటి నుంచే స్పష్టత రావాలన్న ఉద్దేశంతో ఫిట్ నెస్ , ఫామ్ కే ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. గత కొంతకాలంగా జడేజా ఆశించిన విధంగా రాణించడం లేదు. టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన జడ్డూ వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వన్డేలకు అందుబాటులో ఉంటానని చెప్పినప్పటకీ గంభీర్ మాత్రం మెగా టోర్నీకి జడ్డూను పరిగణలోకి తీసుకోవడం లేదని పరోక్షంగా చెప్పేశాడు. దీని ప్రకారం చూస్తే ఇక జడేజా టెస్ట్ క్రికెట్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.